నేత్రపర్వం.. పుష్పయాగోత్సవం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రంలో బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి వారి శ్రీపుష్పయాగోత్సవం శనివారం రాత్రి నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ నెల 24వ తేదీ రాత్రి స్వామి వారి కల్యాణం, 27న రథోత్సవం, 28న త్రిశూలస్నానం నిర్వహించగా, ఉత్సవాల ముగింపులో భాగంగా శ్రీపుష్పయాగోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని పూలతో అలంకరించారు. వివిధ రకాల పండ్లు, మిఠాయిలు ఉంచారు. పూలమాలలతో అందంగా అలంకరించిన ఊయలలో స్వామివారి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి, పవళింపు సేవ నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు దంపతులు, ఈఓ బళ్ల నీలకంఠం దంపతులతో పాటు ఉత్సవ కమిటీ, భక్త కమిటీ దంపతులకు దంపత తాంబూలాలు అందజేశారు. ఉత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వారికి ప్రసాద వితరణ చేశారు. ఆలయ పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, అళ్లకి రాజ్‌గోపాల్‌శర్మ, సన్నిధిరాజు వెంకన్న, అంజిబాబు, శ్రీకాకుళపు సత్యనారాయణమూర్తి, వినయ్ పూజలు నిర్వహించారు. శ్రీపుష్పయాగోత్సవాన్ని పురస్కరించుకొని కూచిపూడి గ్రామానికి చెందిన శ్రీసత్యకృష్ణ కూచిపూడి కళానిలయం కళాకారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శన భక్తులను అలరించింది.
Comments
Please login to add a commentAdd a comment