పట్టాల పండగకు సర్వం సిద్ధం
● నేడు రంగరాయ వైద్య కళాశాల
62వ స్నాతకోత్సవం
● పట్టాలు పొందనున్న 248 మంది
వైద్య విద్యార్థులు
కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల 62వ స్నాతకోత్సవం ఆదివారం జరగనుంది. దీనికి కళాశాల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్ పర్యవేక్షణలో ఈ పట్టాల పండగ నిర్వహిస్తున్నారు. కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియం పక్కన ఉన్న ఓపెన్ గ్రౌండ్‌లో సాయంత్రం 4 గంటలకు స్నాతకోత్సవ సంబరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా 2019 బ్యాచ్‌కు చెందిన 248 మంది వైద్య విద్యార్థులకు డాక్టర్ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథిగా ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య సంచాలకుడు, రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం హాజరు కానున్నారు. గౌరవ అతిథిగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్యకుమారి హాజరవుతారు. విజయనగరం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీ మాధవి కూడా అతిథిగా పాల్గొంటున్నారు. ఐదున్నరేళ్ల విద్యలో అత్యంత ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్ ఎ.సాయి అనిరుధ్ స్నాతకోత్సవ భాషణానికి ఎంపికయ్యారు. డాక్టర్ విష్ణువర్ధన్ స్నాతకోత్సవ ప్రారంభోపన్యాసం ఇస్తారు. విద్యార్థులతో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఏవీఎస్ శశి వైద్య ప్రమాణం చేయిస్తారు. స్నాతకోత్సవ వేడుకకు 5 వేల మంది హాజరవుతారని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment