ఓపెన్‌కు సర్వం సిద్ధం
పకడ్బందీగా చేపట్టాలి
ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. ఇప్పటికే సీఎస్, డీవోలకు ఓరియంటేషన్ నిర్వహించాం. ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని డీఈవోలకు ఆదేశాలిచ్చాం.
– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల
విద్యాశాఖ, కాకినాడ
● నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాలు
● హాజరు కానున్న 16,072 మంది విద్యార్థులు
● 17 నుంచి పదో తరగతి పరీక్షలు
రాయవరం: ఈ నెల ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభంగా కాగా, ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా ఏటా నిర్వహించే ఇంటర్ పరీక్షలను సైతం సోమవారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉన్నత చదువు కోసం ఆశ పడినప్పటికీ అనుకోని అవాంతరాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువు నిలిపివేసిన వారి కోసం ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా ఓపెన్ స్కూల్ విధానం ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఓపెన్ స్కూల్ ద్వారా పది, ఇంటర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఇప్పటికే హాల్ టిక్కెట్లను విడుదల చేశారు.
ఉత్తీర్ణులు కానివారు సైతం
ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు ఇంటర్ పరీక్షలకు 16,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో పరీక్షలు రాసి, ఉత్తీర్ణులు కానివారు కూడా ఇప్పుడు పరీక్షలు రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు విద్యార్థులకు చేరాయి. ఈ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
పదో తరగతి పరీక్షలు ఇలా..
ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా నిర్వహించే పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. రెగ్యులర్ విద్యార్థులతో పాటే ఓపెన్ విద్యార్థులకూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,947 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు
జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాలు, విద్యార్థుల వివరాలు
జిల్లా పది ఇంటర్
విద్యార్థులు విద్యార్థులు
కోనసీమ 1,195 4,645
కాకినాడ 2,248 6,625
తూర్పు 2,504 4,802
మొత్తం 5,947 16,072
Comments
Please login to add a commentAdd a comment