‘జయలక్ష్మి’ బాధితులకు న్యాయం చేయండి
కాకినాడ రూరల్: జయలక్ష్మి సొసైటీ బాధితులకు న్యాయం చేయాలని బాధితుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక చల్లా కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ లిమిటెడ్ డిపాజిటర్ల బాధితుల సంఘం సమావేశం నిర్వహించింది. సమావేశానికి అధ్యక్షుడు జి.బదరీనారాయణ అధ్యక్షత వహించారు. 2022లో సుమారు 560 కోట్ల రూపాయలు డిపాజిటర్ల సొమ్ముతో జయలక్ష్మి సొసైటీ గత పాలకవర్గం బోర్డు తిప్పేసిందని, ఇప్పటికీ న్యాయం జరగలేదని పలువురు బాధితులు పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన పలువురు బాధితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బదిరీనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం గంగిరెడ్డి త్రినాథరావు అధ్వర్యంలో ఉన్న పాలకవర్గానికి జవాబుదారీతనం లోపించిందన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదన్నారు. పలువురు వృద్ధాప్యంలో ఉండి ఇబ్బందులు పడుతున్నందున వారికోసం పోరాడాల్సింది పోయి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై తాము గత నెలలో అవిశ్వాస తీర్మానం చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న బోర్డులను తొలగించి రహస్య ఓటింగ్ ద్వారా కొత్తగా బోర్డును ఏర్పాటు చేయాలని, అందులో ప్రభుత్వ ఉద్యోగి విధిగా ఉండాలని సభ్యులు సూచిస్తున్నారన్నారు. తాము బాధితుల పక్షాన పోరాడతామని, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో పిల్లి గణేష్, రామారావు, వీఎస్‌వీ సుబ్బారావు, రఘు, భూషణ్, నాగేశ్వరరావు, ప్రభాకరరావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment