
అగ్ని ప్రమాదానికి పశువుల శాల ఆహుతి
● కాలిపోయిన 4 గేదెలు, రెండు ఆవులు, నాలుగు దూడలు
● రూ.ఐదు లక్షల నష్టం
సామర్లకోట: మండల పరిధిలో వీకే రాయపురంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు గేదెలు, రెండు ఆవులు, నాలుగు దూడలు పూర్తిగా కాలిపోయాయి. వీటిలో రూ.1.50 లక్షల విలువ కలిగిన గేదె అక్కడికక్కడే మృతి చెందింది. రైతులు, బాధితుల కథనం ప్రకారం వీకే రాయపురం సమీపంలోని మామిళ్లదొడ్డిలోని పశువుల పాకపై విద్యుత్తు వైరు తెగి పడిపోవడంతో మంటలు చెలరేగి పశువుల పాక పూర్తిగా కాలి బూడిద అయింది. ఆ పాకలో ఉన్న పశువులు పూర్తిగా కాలిపోయాయి. మూగజీవాల ఆర్తనాదాలకు సమీపంలో ఉన్న రైతులు పశువుల పాక వద్దకు చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసి పశువుల యజమాని రంగనాథం వీరభద్రరావుకు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం పశువైద్యాధికారి మాకినీడి సౌమ్య ఘటనా ప్రదేశానికి చేరుకొని కాలిపోయిన పశువులను పరిశీలించారు. కాలిపోయిన పశువులు జీవించే అవకాశం లేదన్నారు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం ఉంటుందని చెప్పారు. కాలిపొయిన పశువుల ఆర్తనాదాలు రైతుల హృదయాలను కదిలించి వేశాయి. పశువుల పరిస్థితిని చూచి వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు తలారి దొరబాబు, రైతు సంఘ నాయకుడు ఇంటి వెంకట్రావులు కంటతడి పెట్టుకున్నారు. వైద్యం అందించినా పశువులు జీవించే అవకాశం లేదని వైద్యాధికారి సౌమ్య తెలిపారు. రెండు పశువులకు మాత్రమే బీమా ఉన్నదని ఆమె చెప్పారు. పశువులకు జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు పంపుతానని చెప్పారు. వీఆర్వో రైతుల నుంచి సమాచారం సేకరించి తహసీల్దార్‌ను నివేదిక సమర్పించారు.
స్విమ్మింగ్ పూల్‌లో తప్పిన ప్రమాదం
నీట మునిగి సీపీఆర్‌తో బతికిన స్విమ్మర్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తూ మునిగిపోయి ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా స్విమ్మింగ్ పూల్ సిబ్బంది సకాలంలో స్పందించడంలో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్‌లో ఉదయం 8 నుంచి 9 గంటల బ్యాచ్‌లో శంఖవరం గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్ నెల రోజుల నుంచి కాకినాడ స్విమ్మింగ్ చేస్తున్నాడు. రోజులాగే మంగళవారం కూడా స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన ఆయన ఈత కొడుతున్న సమయంలో ముక్కులోకి నీరు వెళ్లి ఊపిరి ఆడక అస్మారక ిస్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు, సీనియర్ స్విమ్మర్లు దానిని గమనించి ప్రదీప్‌కుమార్‌ను కొలనులోనుంచి బయటకు తీసి సీపీఆర్ చేసి అంబులెన్సులో దగ్గర ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ప్రదీప్‌కు ఆస్తమా ఉన్న కారణంగా ఊపిరి సమ్యస్య వచ్చిందని తెలిపి చికిత్సను ప్రారంభించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద లైఫ్‌గార్డుల స్థానంలో సీనియర్ స్విమ్మర్లను డీఎస్‌ఏ అధికారులు కొనసాగిస్తున్నారు. లైఫ్‌గార్డుల నియామకానికి శాప్‌కు లేఖ రాసినా ఇంతవరకు అనుమతి రాకపోవడంతో సీనియర్‌లను కొనసాగించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. డీఎస్‌డీఓ శ్రీనివాస్‌కుమార్‌ను వివరణ కోరగా త్వరలోనే లైఫ్‌గార్డులను నియమిస్తామని తెలిపారు.
క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స
కాకినాడ క్రైం: కాకినాడలోని జై బాలాజీ ట్రాన్స్‌పోర్ట్‌లో సోమవారం చోటు చేసుకున్న బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స కొనసాగుతోంది. కాకినాడ వన్‌టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయగా విచారణ కొనసాగుతోంది. మంగళగిరి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ బృందం పేలుడు జరిగిన ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. పలు నమూనాలు సేకరించింది.

అగ్ని ప్రమాదానికి పశువుల శాల ఆహుతి
Comments
Please login to add a commentAdd a comment