నైతిక విలువలు లేకుంటే ఎన్ని డిగ్రీలు ఉన్నా వృథాయే
● ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ
● నారీ ఫెస్ట్ 2025 ఉత్సవాలు ప్రారంభం
రాజానగరం: సమాజంలో నైతిక విలువలు పాటించని వారికి ఎన్ని డిగ్రీలు ఉన్నా వృథాయేనని, వాటికి విలువ కూడా ఉండదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ మూడు రోజులపాటు నిర్వహించే ‘నారీ ఫెస్ట్ 2025’ ఉత్సవాలను మంగళవారం ఒక చిన్నారితో జ్యోతిని వెలిగింపజేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన సభలో వీసీ మాట్లాడుతూ ఆడవారిని ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అంటే సరిపోదని, ఆదరించడంలో కూడా సగం కావాలన్నారు. ఆడవారికి ఆదరణే ఆధారమని, ఆ ఆదరణ తల్లిదండ్రుల నుంచి, జీవిత భాగాస్వామి నుంచి, పిల్లల నుంచి లభిస్తుందన్నారు. గతంలో ఆడవారి పట్ల వివక్ష చూపేవారని, ఆధునిక సమాజంలో కొంత మార్పు వచ్చిందన్నారు. ఇదే క్రమంలో రాబోయే కాలంలో వివక్ష లేని సమాజం వైపు అడుగులు వేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. తరాలు మారుతున్నా అంతరాలు మారకూడదనే ఉద్దేశంతో బామ్మ – మనుమరాలి షో నిర్వహిస్తున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే బామ్మలను స్ఫూర్తినగా మార్గదర్శకంగా తీసుకుని ఆమె చేయి పట్టుకుని మనుమరాళ్లు నడుస్తుంటే ముచ్చటగొలుపుతుందన్నారు. పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలని, వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజం వైపు పయనించాలన్నారు.
అలరించిన వెల్ బేబీ షో
బామ్మ – మనుమరాలు షోతోపాటు నిర్వహించిన వెల్ బేబీ షోకు కూడా అపూర్వ స్పందన లభించింది. రాజమహేంద్రవరం పరిసరాల నుంచి తరలివచ్చిన అనేక మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను వేదిక పైకి తీసుకువచ్చి, బుడగలతో పోటీలు నిర్వహించడంలో ఎంజాయ్ చేశారు. అలాగే గ్రూప్ సింగింగ్, గ్రూప్ డాన్స్, ఫ్యాషన్ షో, స్కిట్స్‌లలో పోటీలు జరిగాయి. పరిసరాలలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. ఉమామహేశ్వరిదేవి, ప్రిసైడింగ్ అధికారి డాక్టర్ వి.పెర్సిస్, డాక్టర్ ఎన్.సజనారాజ్, డాక్టర్ కె.దీప్తి, డాక్టర్ డి. లతా, డాక్టర్ బి.విజయకుమారి, ఆచార్య డి.జ్యోతిర్మయి, డాక్టర్ పి.విజయనిర్మల, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ కె.నూకరత్నం, డాక్టర్ పద్మావతి, డాక్టర్ కె.రమణేశ్వరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment