రంగంపేట: గురుకుల విద్యాలయాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు లక్ష్మీ నరసాపురం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వై.లక్ష్మణకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న 21 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియెట్ (ఇంగ్లిషు మీడియం)లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి దరఖాస్తులు అందించాలన్నారు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు. ఈ గురుకుల విద్యాలయాలు ప్రత్యేకంగా పేద, నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం ఉందని, వీటిలో విద్యార్థులు సెల్‌ఫోన్ సంస్కృతి నుంచి దూరంగా క్రమ శిక్షణ, ఆత్మస్థైర్యం, మంచి ఆరోగ్యం, మంచి జీవన శైలి నేర్చుకోవచ్చునని తెలిపారు. ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య, పౌష్టికాహారం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, స్టూడెంట్ స్టేషనరీ, స్పోర్ట్స్ తదితర సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment