ప్రభుత్వానికి, వ్యాపారులకు వారధిగా సీఏలు
బోట్‌క్లబ్ (కాకినాడ) : ప్రభుత్వానికి, వ్యాపారులకు మధ్య వారధులుగా సీఏలు పనిచేస్తున్నారని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ చార్టర్డ్ అకౌంట్స్ కాకినాడ చాప్టర్ కార్యాలయంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ కాకినాడ బ్రాంచ్ చైర్మన్ తాలూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో సీఏలు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 1956లో ఇన్‌కమ్‌టాక్స్ వ్యవస్థ ఏర్పడిందని అప్పటి నుంచి ఇప్పటి వరకూ సీఏలు ఎంతగానో సేవలందిస్తున్నారన్నారు. జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డు సైతం అందించిందన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా 11 సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కార్యాలయాలను తీసుకువస్తుందన్నారు. త్వరలోనే విజయవాడ కేంద్రంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాకినాడ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు టి.పవన్‌కుమార్, సెక్రటరీ పాండురంగమూర్తి, ట్రెజరర్ సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
10న అప్రెంటిస్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వివిధ కంపెనీల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఈ నెల 10వ తేదీన కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఐటీఐలో ఉత్తీర్ణులై ఎన్‌టీసీ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఉదయం 9గంటలకు కళాశాలకు హాజరుకావాలని, ఇతర వివరాలకు 86392 30775 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
అధికారుల 2కే రన్
కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. శుక్రవారం నాగమల్లితోట నుంచి ప్రారంభమైన ఈ రన్ భానుగుడి కూడలి వరకు సాగింది. అక్కడ మానవహారాన్ని ఏర్పాటు చేసి మహిళల భద్రత, రక్షణపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో పోలీస్‌శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వానికి, వ్యాపారులకు వారధిగా సీఏలు
Comments
Please login to add a commentAdd a comment