
పొలాలను వదిలి.. రోడ్డుపై బైఠాయించి..
● సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు
● జాతీయ రహదారి 216పై రాస్తారోకో
● అధికారుల హామీతో ఆందోళన విరమణ
తాళ్లరేవు: సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారి 216పై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పి.మల్లవరం పంచాయతీ పరిధిలోని శివారు భూములకు కొన్ని రోజులుగా సాగునీరు అందక వరి చేలు ఎండిపోతుండడంతో శనివారం రైతులు పోలేకుర్రు ఇరిగేషన్ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే కార్యాలయంలో ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంతనే ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
ఆందోళకారులతో చర్చలు
విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. రైతులు తమ సమస్యలను ఎస్సైతో పాటు రెవెన్యూ అధికారులకూ మొరపెట్టుకున్నారు. పి.మల్లవరం పంచాయతీ శివారు మూలపొలం, గ్రాంటు, రాంజీనగర్ గ్రామాలకు 20 రోజులుగా సాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరిచేలు పొట్టదశలో ఉన్నాయని, ఈ సమయంలో సరిపడా నీరు లేకపోతే తీవ్రంగా నష్టపోతామన్నారు. వంతుల వారీ విధానం పెట్టినప్పటి నుంచి సాగునీరు సరఫరా కావడం లేదన్నారు. ఎగువ రైతులకు మేలు జరుగుతుందని, తమ వంతు వచ్చేసరికి కాలువ చివరికే నీరు రావడం లేదన్నారు.
తూతూమంత్రంగా..
అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు ఈ సమస్యను విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రైతులు వాపోయారు. అధికారులు తూతూ మంత్రంగా వచ్చి వెళుతున్నారని, అయితే సాగునీరు మాత్రం వరిచేలోకి రావడం లేదన్నారు. సాగు ప్రారంభంలో అధికారులను సంప్రదిస్తే ప్రతి ఎకరాకు నీరిస్తామని చెప్పారని అయితే ప్రస్తుతం నీరు అందక సుమారు 600 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. కాగా.. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు.
తక్షణమే సరఫరా చేయాలి
సాగునీరు లేక ఎండిపోతున్న శివారు ప్రాంత భూములకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మండలంలో పర్యటిస్తున్న ఆయన రైతుల ఆందోళన విషయం తెలుసుకుని అక్కడకు వచ్చారు. రైతుల సమస్యలు తెలుసుకుని ధవళేశ్వరం సర్కిల్ ఇరిగేషన్ ఈఈ రామకృష్ణతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే చూడలేక రైతులు రోడ్డు మీదకు వచ్చారననారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సాగునీటి సమస్య వచ్చిందన్నారు. దీన్ని అత్యవసర పరిస్థితిగా భావించి అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కదిలి, ప్రత్యేక అధికారిని వేయడంతో పాటు, ఎత్తిపోతల ద్వారానైనా ప్రతి ఎకరాకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం ప్రతినిధులు మోర్త రాజశేఖర్, వల్లు రాజబాబు, టి.ఈశ్వరరావు, రైతులు మేడిశెట్టి శ్రీనివాసరావు, పితాని సత్తిబాబు, కె.వెంకన్నబాబు రాజు, కాదా సాయిబాబు, కావూరి వెంకన్న, పేరాబత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు.

పొలాలను వదిలి.. రోడ్డుపై బైఠాయించి..

పొలాలను వదిలి.. రోడ్డుపై బైఠాయించి..
Comments
Please login to add a commentAdd a comment