రహదార్లపై మృత్యు తాండవం | - | Sakshi
Sakshi News home page

రహదార్లపై మృత్యు తాండవం

Published Tue, Mar 11 2025 12:07 AM | Last Updated on Tue, Mar 11 2025 12:07 AM

రహదార

రహదార్లపై మృత్యు తాండవం

కిర్లంపూడి: ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆగి ఉన్న టిప్పర్‌ను బైకిస్ట్‌ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందినట్టు కేసు నమోదు చేశామని కిర్లంపూడి ఏఎస్సై కుమార్‌ తెలిపారు. ఆయన వివరాల మేరకు, చిల్లంగా గ్రామానికి చెందిన కొప్పన అప్పారావు(29) తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వీరవరంలో అత్తారింటికి మోటార్‌ బైక్‌పై బయలుదేరాడు. రాజుపాలెం వంతెన అవతల వైపు మోటార్‌ బైక్‌ అదుపుతప్పి ఆగి ఉన్న టిప్పర్‌ వెనుక భాగంలో ఢీకొనడంతో, అతడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, పాప, బాబు ఉన్నారు. భార్య విశాలాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై తెలిపారు.

రోడ్డుపై ఆందోళన

కగా నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్‌ను రోడ్డుపై ఆపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆరోపించారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు ఉపక్రమించారు. దీంతో కిర్లంపూడి–సామర్లకోట రోడ్డుపై సుమారు 4 గంటల సేపు ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం అందుకున్న పెద్దాపురం ఎస్‌డీపీఓ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, ఎస్సై రాఘనాథరావు అక్కడకు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.

బైక్‌ అదుపుతప్పి..

ముమ్మిడివరం: మోటార్‌ సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు రోడ్డుపై ఆబోతు అడ్డురావడంతో అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అనాతవరం 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మల్లిపూడి ప్రవీణ్‌కుమార్‌ (28), సత్యప్రకాష్‌ ద్విచక్ర వాహనంపై కాకినాడ నుంచి సొంతూరుకు పయనమయ్యారు. అనాతవరం వద్ద జాతీయ రహదారిపై అడ్డొచ్చిన ఆబోతును బైక్‌తో ఢీకొన్నారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కుమార్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన సత్యప్రకాష్‌ను అమలాపురంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై డి.జ్వాలాసాగర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని వివాహిత మృతి

రావులపాలెం: ఊబలంకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వందే విజయకుమారి(40) మృతి చెందారు. ఎస్సై నాయుడు రాము వివరాల మేరకు, ఆత్రేయపురం మండలంలోని కట్టుంగకు చెందిన విజయకుమారి భర్త రమేష్‌బాబుతో కలిసి అమలాపురంలో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు మోటార్‌ బైక్‌పై వెళ్లారు. సోమవారం సాయంత్రం తిరుగు పయనమయ్యారు, స్థానిక వినాయకుని ఆలయం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి లారీ వారి బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, విజయకుమారి పైనుంచి లారీ దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి మృతి

పరీక్ష రాయడానికి వెళ్తూ విద్యార్థి..

ఆబోతు అడ్డొచ్చి ఓ యువకుడు

అత్తారింటికి వెళుతూ మరో వ్యక్తి

పరీక్షకు వెళుతూ మృత్యుఒడికి..

సామర్లకోట: ఇంటర్మీడియెట్‌ పరీక్ష రాయడానికి సోమవారం ఇంటి నుంచి మోటార్‌ బైక్‌పై బయలుదేరిన విద్యార్థి మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన ఇది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు, మండలంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన ప్రగడ వంశీ(19) ఇంటర్‌ సెకండియర్‌ పరీక్ష రాయడానికి ఇంటి నుంచి కాకినాడకు బైక్‌పై బయలు దేరాడు. గొంచాల గ్రామంలోని మలుపులో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ అతడి బైక్‌ను ఢీకొనడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై రాంబాబు తన సిబ్బందితో సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి చనిపోవడంతో, ఒక్కగానొక్క కుమారుడిని తల్లి గారాబంగా పెంచుతూ, చదివిస్తోంది. పరీక్ష రాయడానికి వెళ్లిన కుమారుడు ఇక శాశ్వతంగా తిరిగిరాడని తెలుసుకుని ఆ తల్లి సంఘటన స్థలంలో గుండెలవిసేలా రోదించింది. తాను ఎవరి కోసం బతకాలంటూ ఆమె రోదించిన తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఎస్సై రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రహదార్లపై మృత్యు తాండవం 1
1/1

రహదార్లపై మృత్యు తాండవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement