పీజీఆర్‌ఎస్‌కు 594 అర్జీలు
కాకినాడ సిటీ: ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యమిచ్చి సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీనా అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పీజీఆర్‌ఎస్) సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగింది. ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడారు. అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అర్జీదారుని సమస్యకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, ఆక్రమణలు తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 594 అర్జీలు అధికారులు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, కేఎస్‌ఈజెడ్ ఎస్డీసీ కేవీ రామలక్ష్మి, సీపీవో పి త్రినాథ్, పీడీ శ్రీధర్ పాల్గొని అర్జీలు స్వీకరించారు.
సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయం ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంతి మండపాలు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 30 లక్షలు ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజన సౌకర్యం కల్పించారు. సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు పుష్పార్చన నిర్వహించారు. ముత్యాల కవచాల అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతీ రోజు స్వర్ణాభరణాలు, వజ్ర కిరీటాలతో భక్తులకు దర్శనమిచ్చే స్వామి, అమ్మవారు ప్రతీ సోమవారం ముత్యాల కవచాలతోను, ప్రతీ గురువారం ఏ విధమైన ఆలంకరణలు లేకుండా నిజరూపంలో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే.
పీజీఆర్‌ఎస్‌కు 594 అర్జీలు
Comments
Please login to add a commentAdd a comment