అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
సామర్లకోట: న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సమస్యలను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చలో విజయవాడకు అంగన్‌వాడీ కార్యకర్తలు పిలుపునిస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం సామర్లకోటలో అడ్డుకున్నారు. పట్టణ, మండలంలోని ముఖ్య కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ చలో అమరావతి కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులతో తమను అడ్డుకోవడం దారణమన్నారు. ఎన్నికల ముందు 42 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్షల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోనికి వచ్చి 10 నెలలు గడుస్తున్నా తమ సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కనీస వేతనాలు, గ్రాడ్యూటీ అమలు చేయాలని, యాప్‌ల పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.
అంగన్‌వాడీల ధర్నా
కాకినాడ సిటీ: అంగన్‌వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలంటూ విజయవాడలో జరిగే శాంతియుత ధర్నాకు బయలుదేరిన అంగన్‌వాడీలను తుని, సామర్లకోట ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దువ్వా శేషుబాబ్జీ, శంఖవరం రాజేశ్వరి, పిఠాపురం గంగాభవానిలు మాట్లాడుతూ చారిత్రక 42 రోజుల అంగన్‌వాడీల సమ్మె సందర్భంగా శిబిరాల వద్దకు వచ్చి కూటమి ప్రభుత్వం రాగానే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పది నెలలు గడుస్తున్నా జీతాలు పెంచకపోవడాన్ని తప్పుపట్టారు. బతికుండగా వేతనాలు పెంచకుండా, చనిపోయాక మట్టి ఖర్చులు రూ.20 వేలు ఇస్తామని అంగీకరించి, రూ. 15 వేలు చెల్లించేలా జీవో ఇచ్చినందుకు కూటమి నేతలు సిగ్గుపడాలన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు అంగన్‌వాడీలకు గ్రాడ్యూటీ చట్టాన్ని అమలు చేయకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించి చేతులు దులుపుకుంటామంటే ఒప్పుకునేది లేదన్నారు. సెంటర్ అద్దెలు, వంట ఖర్చులు నెలల తరబడి బకాయిలు పెడితే ఇచ్చే 11 వేల వేతనం వీటికి సరిపోతుండగా, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. తక్షణం అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, మొబైల్ యాప్ పనిభారాన్ని తగ్గించాలని, సుప్రీంకోర్టు చెప్పినట్లుగా గ్రాడ్యూటీ చట్టాన్ని అమలు చేయాలని, మినిట్స్‌లో అంగీకరించిన అంశాలన్నింటికీ జీవోలు విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు చెక్కల రాజ్‌కమార్, మలకా రమణ, పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, అంగన్‌వాడీలు సత్యవతి, వీరవేణి, నారాయణమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి పాల్గొన్నారు.
చలో విజయవాడను
అడ్డుకున్న పోలీసులు
అనేకమంది హౌస్ అరెస్టులు
Comments
Please login to add a commentAdd a comment