ఆ ఇద్దరికీ ఆశాభంగం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగుదేశం పార్టీలో కొమ్ములు తిరిగిన జిల్లా నేతలకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కూడబలుక్కుని చెక్ పెట్టారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కేటాయింపులో ఇద్దరు నేతలకు నిరాశ ఎదురైంది. టీడీపీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పవన్ కోసం పిఠాపురాన్ని త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మను రాజకీయంగా తొక్కేస్తున్నారు. మాటల గారడీతో నమ్మించి, పని అయిపోగానే కరివేపాకులా తీసి పడేసే చంద్రబాబు తీరుతో ఎమ్మెల్సీ పదవి పందేరంలో ఆ ఇద్దరికీ మొండిచేయి చూపారు. సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి వీరిద్దరు పదవుల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలానే చంద్రబాబు నమ్మించి నట్టేట ముంచేశారని పార్టీ శ్రేణులే మండిపడుతున్నాయి. వారి ఆశలు సమాధి చేసేందుకు ఒక్కొక్కరికి ఒక కారణం చూపించడంపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
యనమలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
యనమలను ఎమ్మెల్సీగా కొనసాగిస్తారనుకున్న ఆయన అనుచరవర్గం డీలా పడింది. యనమల కుటుంబంలో ముగ్గురు వివిధ పదవులలో ఉన్నారని సాకు చూపి రామకృష్ణుడిని దూరం పెట్టడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. అలా అనుకుంటే తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి, కుమారుడు లోకేష్ మంత్రిగా లేరా అని నిలదీస్తున్నారు. కాకినాడ సీపోర్ట్సు లిమిటెడ్ కేవీ రావుకు వ్యతిరేకంగా యనమల లేఖ రాయడం చినబాబు కోపానికి కారణమై చివరకు ఎమ్మెల్సీ రాకుండా చేసిందంటున్నారు. పార్టీకి ఇన్నేళ్లుగా చేసిన సేవలకు ఇప్పుడు ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.
మరో త్యాగరాజుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ మిగిలిపోయారు. ఈయన పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేశారు. అలా చేయడమే వర్మకు రాజకీయ ప్లాట్‌ఫాం లేకుండా చేసిందని ఆయన అనుచర వర్గం వాపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ గెలుపొంది, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీలో వర్మ రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించేస్తూ చివరకు ఉనికే లేకుండా చేశారని వర్మ అనుచరగణం ఆక్షేపిస్తోంది. పిఠాపురం నుంచి పవన్ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అయ్యాక వర్మను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి వ్యూహంతో పావులు కదుపుతున్నారనే విమర్శలున్నాయి. జనసేన శ్రేణులు మొదటి నుంచి వర్మకు పిఠాపురంలో రాజకీయంగా ఉనికి లేకుండా చేస్తామని బహిరంగంగా చెబుతూనే వస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో విజయవాడ పిలిపించుకుని పవన్ కోసం సీటు త్యాగం చేసినందుకు తొలి ఎమ్మెల్సీ ఖాయమని హామీ ఇచ్చారు. ఇప్పటికి రెండు, మూడు పర్యాయాలు ఎమ్మెల్సీల ఎంపిక జరిగినా వర్మకు అవకాశం లేకుండా చేశారంటున్నారు. వర్మ ముందరికాళ్లకు బంధమేస్తూ రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితి తీసుకువస్తున్నారు. ఒకప్పుడు వర్మతో చెట్టపట్టాలేసుకు తిరిగి మారిన రాజకీయ సమీకరణల్లో జనసేనలో చేరిన నేతలు వర్మకు వ్యతిరేకంగా పావులు కదిపి ఎమ్మెల్సీకి మోకాలడ్డారంటున్నారు. వర్మకు ఎమ్మెల్సీ రాకపోవడమనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సందర్భంలో పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా అని ప్రకటించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకొచ్చిందనే సందేహం పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతోంది. వర్మ వ్యవహారంలో జనసేనకు సంబంధం లేదని నాదెండ్ల సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. పైకి చెబుతున్నదంతా వాస్తవమా కాదా అనేది పక్కనబెడితే వర్మకు రాజకీయంగా ముకుతాడు వేయడమనేది కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదేనంటున్నారు. దీని వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి వ్యూహం లేకపోలేదనే వాదన కూటమిగా జతకట్టిన మూడు పార్టీల్లో బలంగా వినిపిస్తోంది. కేవలం తన సోదరుడు, సినీ నటుడు నాగబాబుకు పిఠాపురంపై పెత్తనానికి లైన్ క్లియర్ చేయడంలో భాగమే ఇదంతా అంటున్నారు. అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు, ఉప ముఖ్యమంత్రిగా పరిపాలనా అవసరాలు దృష్ట్యా పిఠాపురాన్ని గాలికొదిలేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో సోదరుడిని ఎమ్మెల్సీ చేయడం ద్వారా పిఠాపురం బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో వర్మకు ప్రొటోకాల్ పదవి కల్పిస్తే నియోజకవర్గంలో జనసేన నేతలకు ఎదురయ్యే పరిణామాలపై చంద్రబాబు, పవన్ మధ్య ఒక అవగాహన కుదిరిందనే ప్రచారం పార్టీలో విస్తృతంగా సాగుతోంది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మర్రెడ్డి శ్రీనివాస్ నాయకత్వ పటిమపై అపనమ్మకం వెరసి నాగబాబుకే అప్పగించాలనే యోచనతోనే వర్మకు పై స్థాయిలోనే మోకాలడ్డారనే బలమైన వాదన ప్రచారంలో ఉంది. వర్మకు అన్యాయం చేశారంటూ టీడీపీలో ఆయన అనుచరవర్గం మండిపడుతోంది. అసలు పిఠాపురంలో టీడీపీని లేకుండా చేసే కుట్ర జరుగుతోందంటూ పార్టీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఇస్తామని అన్యాయం చేయడంపై వర్మ అంతర్గతంగా మధనపడుతున్నా పైకి మాత్రం చంద్రబాబుతో 23 ఏళ్లలో ఎన్నో సమస్యలతో పనిచేశానని చెప్పుకొచ్చారు. లోకేష్ ఆదేశాలకు తాను, తన కుటుంబం, పార్టీ నేతలు అండగా ఉంటామని ప్రకటించడం గమనార్హం.
‘బాబు’–పవన్ సమష్టి వ్యూహం
వర్మను అడ్డుతొలగించిన జనసేన
అంతా పిఠాపురం పెత్తనం కోసమే
నాగబాబుకు లైన్ క్లియర్
యనమలకు చెక్ పెట్టిన ‘చినబాబు’
ఆ ఇద్దరికీ ఆశాభంగం!
ఆ ఇద్దరికీ ఆశాభంగం!
Comments
Please login to add a commentAdd a comment