ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దాం
తుని రూరల్: యువత పోరుతో చంద్రబాబునాయుడి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దామని, ఈ నెల 12న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువత పోరు జయప్రదం చేయాలని ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. సోమవారం తుని మండలం ఎస్.అన్నవరం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలసి ఆయన యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు తరపున వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో యువత పోరు నిరసన గళం వినిపిస్తామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళమెత్తుతామన్నారు. యువత పోరు విజయవంతం చేసేందుకు మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఐదు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు భృతి, తల్లికి వందనం బకాయిలు రాబట్టేందుకు ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా వెంట నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా నడుద్దామని ఆ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు అన్నారు. విద్యార్థులను, ప్రజలను, రైతులను మోసగించేలా చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. నాయకులు పోతల రమణ, సకురు నాగేంద్ర నెహ్రూ, నాగం దొరబాబు, అంగుళూరి సుశీల రాణి. పార్టీ,మూడు మండలాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
బాబు అనుయాయులకు
మెడికల్ కాలేజీలు కట్టబెట్టే యత్నం
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో వైద్య విద్యార్థుల భవిష్యత్ కోసం తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలను తన మనుషులకు (అనుయాయులకు) కట్టబెట్టేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు. సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరంలో తన కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైద్య విద్యార్థుల భవిష్యత్ కోసం ఒక్కొక్కటి రూ.వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రూ.17వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. 50శాతానికి పైగా నిర్మాణ పనులు జరిగాయన్నారు. చంద్రబాబు తన సొంత ఆస్తిలా తన మనుషులకు కారు చౌకగా కట్టబెట్టేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతున్నా మేధావులు, విద్యావేత్తలు ఏం చేస్తున్నారని, ఎందుకు మౌనంగా ఉంటున్నారని అన్నారు. ఎల్లో మీడియాను చూసి నిర్లిప్తంగా ఉంటున్నారన్నారు. 17 మెడికల్ కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు చెందిన ఆస్తి. ఆ ఆస్తిని తన తాబేదార్లకు కారుచౌకగా కట్టబెందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేధావులు, విద్యావంతులు, ప్రజలు గళమెత్తి, బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉంచాలన్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీ ముందుంటుందన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
ఎస్.అన్నవరంలో
యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment