ఆలయాల్లో సమస్యలు పట్టేదెవరికి..?
నిజామాబాద్ రూరల్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో కార్యనిర్వహణాధికారుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఉన్న వారికే అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆలయ పరిపాలన దారితప్పుతోంది. పూర్తి స్థాయి లో ఈవోలను నియమించాలని సిబ్బంది కోరు తున్నారు. జిల్లా కేంద్రంలోని మాధవనగర్ సాయిబాబా ఆలయ కార్యనిర్వాహుకుడిగా(ఈవో) పనిచేస్తున్న ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీరాం రవీందర్‌కు నీలకంఠేశ్వర ఆలయంతో పాటు ఆరు ఆలయాల కార్యనిర్వహణ బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగించారు. ఇదివరకు గ్రేడ్–1 ఉన్న ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లారు. దీంతో శ్రీరాం రవీందర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా జెండా బాలాజీ మందిరానికి ఈవోగా ఉన్న వేణు జానకంపేట శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయంతో పాటు మరో ఐదు ఆలయాలకు కార్యనిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని బడా రాంమందిర్ భూములకు సంబంధించిన రూ. వేల కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం కాకుండా ఫిట్‌పర్సన్‌గా నియమించారు. దీంతో నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రతోపాటు నాందేడ్‌లో ఉన్న భూములు సర్వే చేయాల్సి ఉంటుంది.
ఆలయాల్లో ప్రధాన బాధ్యత ఈవోలదే..
దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రధాన ఆలయాల్లో హుండీ లెక్కింపు, ఆలయాల భూముల పరిరక్షణ, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయాల సిబ్బందికి, అధికారులకు కార్యనిర్వహణ అధికారుల(ఈవో) బాధ్యత ఎంతగానోఉంటుంది. వీరు ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దూపదీప నైవేద్యాల నిధులను సమకూర్చడంలోనూ వీరు బాధ్యత వహిస్తారు.
పనిభారం పెరిగి..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో మొత్తం 11 మంది కార్యనిర్వహణ అధికారులు(ఈవో) ఉండాలి. కానీ ఆరుగురే ఉన్నారు. దీంతో ఉన్నవారికే ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. దీంతో వీరి పరిధిలో ఉన్న ఆలయాలే కాక అదనపు బాధ్యతలతో సతమతమవుతున్నారు. ఒక్కొక్క ఈవో పదికి మించి ఆలయాల పర్యవేక్ష చేయాల్సి వస్తోంది. దీంతో పనిభారం పెరిగి పాలన అస్తవ్యస్తంగా మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈవోలను నియమించి ఆలయాల్లో నెలకొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిబ్బంది కోరుతున్నారు.
నీలకంఠేశ్వర ఆలయం
కార్యనిర్వహణాధికారుల కొరత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11 మందికి ఆరుగురే ఈవోలు
ఉన్న వారికి అదనపు బాధ్యతలు
పనిభారంతో అస్తవ్యస్తంగా
మారిన ఆలయాల పాలన
నివేదిక అందించాం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఖాళీగా ఉన్న ఈవో పోస్టుల కోసం దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులకు నివేదిక అందించాం. పూర్తి స్థాయిలో ఆలయాల్లో అధికారులు, సిబ్బంది ఉంటే ఉత్సవాలు, పండుగలకు ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాలకు ఐదుగురు కార్యనిర్వహణ అధికారులు అవసరం. ఆలయ భూముల పరిరక్షణ సర్వే వివరాల కోసం సిబ్బంది కూడా అవసరమే. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము.
– శ్రీరాం రవీందర్, ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్
ఉమ్మడి జిల్లాలో 1,359 ఆలయాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,359 ఆలయాలు ఉన్నాయి. వీటిలో రూ. కోటి ఆదాయం వచ్చే ఆలయాలు 6(ఏ)కింద ఆరు ఆలయాలు ఉంటే, రూ. 25 లక్షలు ఆదాయం ఉన్నవి 6(బీ) కింద11 దేవాలయాలు, రూ. రెండు లక్షల వరకు ఆదాయం ఉన్న ఆలయాలు 6(సీ)కింద 1,340 ఆలయాలు ఉన్నా యి. మఠాలు 6(డి) కింద ఉన్నాయి. ఇందులో 384 దేవాలయాలకు 4,153.25 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిలో 568.94 ఎకరాలను రైతులకు కౌలుకు ఇచ్చారు. దీని ద్వారా ఆలయాలకు రూ.27.53 లక్షల ఆదాయం సమకూరుతోంది.
ఆలయాల్లో సమస్యలు పట్టేదెవరికి..?
Comments
Please login to add a commentAdd a comment