బైక్ స్కామ్ నిందితుల అరెస్టు
ఆర్మూర్‌టౌన్: ఇన్సూరెన్స్ కంపెనీ వారిని మోసగించి బైకులను విక్రయించిన కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 27 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నిందితుల వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన షాహిద్ అలీ అతని స్నేహితుడు సయ్యద్ ఒమేర్ బీమా కంపెనీని మోసం చేసి బైక్‌లతో డబ్బులు సంపాదించడానికి పథకం రచించారు. పథకంలో భాగంగా అడ్రస్ ప్రూఫ్ సరిగా లేని వారి ఐడీ కార్డులు సృష్టించారు. వాటి ద్వారా హైదరాబాద్‌లోని బైక్ షో రూంలో సయ్యద్ ఒమేర్ డౌన్ పేమెంట్ కట్టి హీరో ఫిన్‌కార్ప్ లిమిటెడ్ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకొని హీరో కంపెనీకి చెందిన బైకులను కొనుగోలు చేసేవారు. తర్వాత అనుమానం రాకుండా ఫైనాన్స్ కంపెనీకి బైకుల రుణాలకు సంబంధించి రెండు వాయిదాలు చెల్లించి బైక్‌లను ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అనంతరం బైక్‌లు చోరీకి గురయ్యాయని పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్ పొంది బీమా కంపెనీ నుంచి సదరు వాహనాల బీమా డబ్బులు పొందేవారు. కొనుగోలు చేసిన వాహనాలను హైదరాబాద్‌కు చెందిన సాబీర్ ఖాన్ ద్వారా కామారెడ్డికి చెందిన మహ మ్మద్ యాసిన్‌కు పంపేవారు. ఆ బైకులను ఆర్మూ ర్, డొంకేశ్వర్, సిరికొండ, ధర్పల్లి, మాక్లూర్ మండల ప్రజలకు విక్రయించినట్లు ఏసీపీ తెలిపారు. బైక్‌లను అమ్మిన వ్యక్తికి, ఏజెంట్లుగా వ్యవహరించిన వారికి కమీషన్ ఇచ్చేవారు. ఫైనాన్స్ చేసిన బైక్‌లు చోరీకి గురవుతుండడంతో అనుమానం వచ్చిన హైదరాబాద్‌కు చెందిన హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్ సేల్స్ మేనేజర్ షేక్ అబ్దుల్ రఫీ ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా నిందితులను పట్టుకున్నారు. కేసును చేధించిన పోలీసులను ఏసీపీ అభినందించారు. సమావేశంలో ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, ఎస్సై ఇంద్రకరణ్ రెడ్డి, తిరునగరి గోవింద్, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment