ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌

Published Tue, Mar 4 2025 2:23 AM | Last Updated on Tue, Mar 4 2025 2:24 AM

ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌

ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌

ఓపెన్‌ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌కు

రూ. 10 వేల డిమాండ్‌

అవినీతి నిరోధక శాఖకు

పట్టించిన బాధితుడు

ఖలీల్‌వాడి : నిజామాబాద్‌ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌–2 శ్రీరామరాజు, స్వీపర్‌ రంగ్‌సింగ్‌ వెంకట్రావులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అయితే లంచం ఇచ్చిన బాధితుడి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓపెన్‌ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం బాధితుడు సోమవారం ఉదయం 11.50 గంటలకు సబ్‌రిజిస్ట్రార్‌ చెన్నమాధవేణి శ్రీరామరాజు వద్దకు వెళ్లగానే డాక్యుమెంట్‌ను కౌంటర్‌లో ఇవ్వాలని, లంచం డబ్బులు స్వీపర్‌ రంగ్‌సింగ్‌ వెంకట్రావుకు ఇవ్వాలని చెప్పారు. బాధితుడు డాక్యుమెంట్లను కౌంటర్‌లో ఇచ్చి అనంతరం స్వీపర్‌ వెంకట్రావును కలిశారు. బాధితుడిని స్వీపర్‌ వెంకట్రావు కార్యాలయ అధికారులు భోజనం చేసే గదిలోకి తీసుకువెళ్లి రూ.10 వేలు తీసుకుని జేబులో పెట్టుకొగానే అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓపెన్‌ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయడానికి సబ్‌రిజిస్ట్రార్‌–2 శ్రీరామరాజు డబ్బులు డిమాండ్‌ చేయడంతో కెమికల్‌ పూసిన రూ.10 వేలు ఇచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. స్వీపర్‌ వెంకట్రావును పట్టుకున్న అనంతరం విచారణ జరిపి సబ్‌రిజిస్ట్రార్‌–2 శ్రీరామరాజు అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇద్దరిని హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ప్రభుత్వ శాఖల్లో అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే బాధితులు ఎవరైనా ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కు ఫోన్‌ చేయాలని ఎసీబీ డీఎస్పీ కోరారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌–2 శ్రీరామరాజు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ దాడుల సందర్భంగా కార్యాలయంలో రెండుగంటల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్‌ చేసుకునే వారి డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతనే లోనికి అనుమతి ఇచ్చారు. వెయిటింగ్‌ హాల్‌ నుంచే సబ్‌రిజిస్ట్రార్‌–1 రిజిస్ట్రేషన్లు చేశారు.

సబ్‌రిజిస్ట్రార్‌–2 శ్రీరామరాజు ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నుంచి నిజామాబాద్‌కు బదిలీపై వచ్చారు. మొదట్లో ఇక్కడి డాక్యుమెంట్‌ రైటర్లతో వివాదం జరిగింది. రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ గత నవంబర్‌లో డాక్యుమెంట్‌ రైటర్లు ధర్నా చేశారు. గతంలో రామరాజును నిర్మల్‌ జిల్లా భైంసాలో పని చేస్తున్న సమయంలో ఇల్లీగల్‌ డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్‌ చేశారనే ఆరోపణలపై ఆదిలాబాద్‌కు బదిలీ చేసినట్లు తెలిసింది. అధికారుల విచారణలో ఇల్లీగల్‌ డాక్యుమెంట్లుగా తేలడంతో అక్కడ రామరాజును సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement