శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలి
భిక్కనూరు: విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటే భవిష్యత్ బాగుంటుందని జిల్లా వైద్యశాఖాధికారి చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ యునివర్సిటీ సౌత్ క్యాంపస్ సోషల్ వర్క్ విభాగం, సూర్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టూడెంట్ సపోర్ట్ కౌన్సెలింగ్ సెంటర్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కౌన్సెలింగ్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలందించాలన్నారు. సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ కో ఆర్డినేటర్ రాజేందర్ మాట్లాడుతూ.. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అన్ని వనరులను అందిస్తామన్నారు. యోగా, ఫిట్‌నెస్, తరగతులను హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. మానసిక వైద్య నిపుణుడు రవితేజ మాట్లాడుతూ.. నేటి సమాజంలో మానసిక ఆరోగ్యం ప్రధాన సమస్యగా ఉందన్నారు. ప్రేమతో మాట్లాడగలిగే వారందరూ కౌన్సెలర్ కావొచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు 80శాతం మంది ప్రజలపై ప్రభావం చూపిస్తోందని దాంతో మానసిక ఆరోగ్యం నశిస్తోందన్నారు. కల్తీ కల్లుకు బానిసైన వారిని బయటపడేసే అవకాశం సోషల్ వర్క్ విద్యార్థులకు ఉంటుందన్నారు. జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్ జి రమణ మాట్లాడుతూ.. మనకు వచ్చే ప్రతి భావోద్వేగాన్ని సమతుల్యంగా ఉంచుకుంటేనే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లన్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, సోషల్‌వర్క్ విభాగాదిపతి డాక్టర్ అంజయ్య, అధ్యాపకులు యాలాద్రి, నర్సయ్య, రమా దేవి, సరిత, నారాయణ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment