సమాజ పరివర్తనకు ‘సంఘ్’ కృషి
● ధర్మ రక్షణ కోసం
శక్తిమంతులుగా తయారవ్వాలి
● దక్షిణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ
ప్రముఖ్ అమర లింగన్న
● ఘనంగా ఇందూరు నగర శాఖల
సమ్మేళనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే హిందూ సమాజానికి శ్రేయస్సు అని, సమాజ పరివర్తనే స్వయం సేవక్‌ల బాధ్యత అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్ అమర లింగన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఆదివారం ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో 56 శాఖల సంగమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా లింగన్న హాజరై ప్రసంగించారు. కుటుంబ వ్యవస్థ మనచేతిలోనే ఉందని, కుటుంబం నుంచే భావి పౌరులకు జీవన విలువలు తెలపాలని అన్నారు. హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఉద్భవించిన కలియుగ ప్రత్యేక అవతారం ఆర్‌ఎస్‌ఎస్ అన్నారు. ధర్మాన్ని కాపాడుకోవాలంటే శక్తిమంతంగా తయారు కావాలని, హిందువులందరూ సంఘటితంగా ఉంటేనే శక్తి సముపార్జన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో బ్రిటిష్ వాడు సృష్టించిన హిందువుల్లోని ఓ వర్గం విభజనవాదం చేస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు చీడపురుగుల్లా తయారయ్యారని, అన్నిమతాలు సమానమని చెబుతూనే మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హిందువులను మైనారిటీలుగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. గిరిజనులు, బంజారాలు, లింగాయత్‌లలో తాము హిందువులం కాదనే భావనను సృష్టిస్తున్నారన్నారు. ఇలాంటి కుట్రలకు ఫండింగ్ చేస్తున్న దొంగలెవరో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.
బానిసత్వంలోకి నెట్టారు..
మహాపురుషులకు కొదువ లేని భారతదేశం కొందరి స్వార్థం, కుట్రల కారణంగా ఆత్మన్యూనత, అనైక్యతలకులోనై బానిసత్వంలోకి నెట్టబడిందని అమర లింగన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ హెడ్గేవార్ భారత్‌ను మళ్లీ గురుస్థానంలోకి తీసుకొచ్చేందుకు స్వాతంత్రోద్యమం చేస్తూనే ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారన్నారు. హిందువుల్లో సమైక్యత నిర్మాణం కోసం కృషి చేశారని, ప్రతిరోజూ హిందువులు కలిసేలా సఫలపూరిత కార్యపద్ధతి నెలకొల్పారన్నారు. సమయపాలన, ఆజ్ఞాపాలన విషయమై పుస్తకాలు రాయలేదని, హెడ్గేవార్ ఆచరించి చూపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితోపాటు స్వయం సేవక్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమాజ పరివర్తనకు ‘సంఘ్’ కృషి
Comments
Please login to add a commentAdd a comment