దూసుకొచ్చిన మృత్యువు
కామారెడ్డి క్రైం/గాంధారి : తెల్లవారుజామున గాంధారి నడిబొడ్డున అదుపుతప్పిన ఓ కారు బీభత్సం సృష్టించింది. బీట్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి మృత్యువు రూపంలో దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మరణించగా మరొకరు గాయాలతో బయటపడ్డారు. గురువారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన వివరాలిలా ఉన్నాయి. గాంధారి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు వడ్ల రవికుమార్ (35) సుభాష్ గురువారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో హనుమాన్ టిఫిన్ సెంటర్ ఎదురుగా బీట్ డ్యూటీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కామారెడ్డి వైపు నుంచి బాన్సువాడ వైపు వెళ్తున్న ఓ కారు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి బీభత్సం సృష్టించింది. కారు ఢీకొనడంతో రవికుమార్ అక్కడికక్కడే మరణించాడు. కారు ప్రమాదకరంగా రావడాన్ని సెకండ్ల వ్యవధిలో గమనించిన మరో కానిస్టేబుల్ సుభాష్ వేగంగా పక్కకు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన సన్నిత్‌కు సైతం గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిని స్థానిక ఆర్‌ఎంపీ కుమారుడిగా గుర్తించారు. వాహనం నడుపుతున్న సమయంలో మద్యం మత్తులో ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో సమీపంలోని దుకాణాల సామగ్రి, బోర్డులు, మెట్లకు ఉండే రెయిలింగ్ చిందరవందర అయ్యాయి. ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
మిన్నంటిన రోదనలు..
తాడ్వాయి మండలం దేమె గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రవికుమార్ కుటుంబం కొంతకాలం క్రితం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో స్థిరపడింది. 2007 బ్యాచ్‌కు చెందిన రవి కుమార్.. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహించి ఇటీవలే గాంధారికి బదిలీ అయ్యాడు. మృతుడికి భార్య సౌఖ్య, కూతుళ్లు రసజ్ఞ, రవిజ్ఞ, కుమారుడు రితేష్ చంద్ర ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కయిన రవికుమార్ అకాల మరణం అతని కుటుబంలో తీరని విషాదాన్ని నింపింది. పోస్టుమార్టం నిర్వహించే జనరల్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా తరలివచ్చారు. పోస్టుమార్టం అనంతరం కానిస్టేబుల్ రవి కుమార్ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో దేవునిపల్లిలో నిర్వహించారు. అంత్యక్రియల్లో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ సంతోష్ కుమార్, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
కానిస్టేబుల్ రవికుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద రవికుమార్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
విధుల్లో ఉన్న పోలీసులను ఢీకొన్న కారు
ఓ కానిస్టేబుల్ మృతి,
మరో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు
గాంధారిలో వేకువజామున
కలకలం రేపిన ఘటన
దూసుకొచ్చిన మృత్యువు
దూసుకొచ్చిన మృత్యువు
Comments
Please login to add a commentAdd a comment