మద్యం మత్తు.. యువత చిత్తు
● మందు, విందుల్లో మునిగి తేలుతున్న
యువకులు
● డ్రంకెన్ డ్రైవ్‌తో రోడ్డు ప్రమాదాలు
● తాగి దారుణాలకు పాల్పడుతున్న
పలువురు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సరదాగా అలవాటైన మద్యపానం.. వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తోంది. హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం మత్తులోనే జరుగుతున్నాయి. నలుగురు స్నేహితులు కలిస్తే చాలు మందు కొనడం, ఎక్కడో ఒకచోట కూర్చుని జల్సా చేయడం అలవాటుగా మారింది. తాగిన మైకంలో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. మత్తులో తూలుతూనే బైకులు, కార్లు నడుపుతూ రోడ్లపై వెళ్లే వారిని ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తాగి వాహనాలు నడిపేవారి మూలంగా ఇతరులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. తమ జల్సాకు డబ్బులు లేకుంటే దొంగతనాలకూ పాల్పడుతున్నారు. మరికొందరు గంజాయి దందాలోనూ దిగుతున్నారు. ఇటీవల దేవునిపల్లి, భిక్కనూరు పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులకు చిక్కిన గంజాయి ముఠాలో స్థానికంగా ఉన్న యువకులే మత్తుకు అలవాటు పడి గంజాయి దందాలో దిగినట్టు తేలింది. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడుతున్నవారికి జరిమానాలు, జైలు శిక్షలు పడుతున్నా మార్పు రావడం లేదు.
మత్తే కారణం...
జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతేడాది జిల్లాలో 513 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 258 మంది మరణించగా 255 మంది గాయపడ్డారు. అన్ని రూట్లలో పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, తాగి వాహనాలు నడిపేవారికి జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదు.
గతేడాది జిల్లాలో 38 హత్యలు జరిగాయి. ఇందులో చాలా వరకు మత్తులో ఆవేశంతో చేసినవే ఉన్నాయి. 60 వరకు రేప్ కేసులు నమోదయ్యాయి. మత్తులో ఏం చేస్తున్నామన్న విచక్షణ కోల్పోయినవారు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొన్ని కేసుల్లో తోడబుట్టిన వాళ్లు, కన్నవాళ్లు, ఇతర రక్తసంబంధీకులు, బంధువులే నిందితులుగా ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన హత్యలన్నింటిలోనూ నిందితులు మత్తులో ఉన్నట్లు తేలుతోంది. ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనల్లోనూ మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవలు పడి చేసుకుంటున్నవే ఎక్కువగా ఉంటున్నాయి.
పెరిగిన గంజాయి సేవనం..
యువత మత్తు కోసం గంజాయికి అలవాటు పడుతోంది. చిన్నచిన్న పొట్లాల రూపంలో అందుబాటులోకి రావడంతో కొనుగోలు చేసి సిగరెట్లల్లో నింపేసి పీలుస్తున్నారు. ఒకసారి అలవాటు పడిన వాడు నిరంతరం అదే మత్తును కోరుకుంటున్నాడు. గంజాయికి అలవాటు పడినవారు కొందరు.. గంజాయి ఎక్కడ దొరుకుతుందో మూలాలు కనుక్కుని దందా నడుపుతున్నారు. ఇటీవల పోలీసులకు చిక్కిన ముఠాలన్నీ మత్తుకు అలవాటు పడి దందాలో దిగినట్టు వెల్లడైంది. బెల్ట్ షాప్‌లు, గంజాయి దందాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
విచ్చలవిడిగా అమ్మకాలు..
జిల్లాలో తాగు నీరు దొరకని గ్రామాలున్నాయి గానీ మద్యం దొరకని ఊళ్లు లేవు. ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కొన్ని ఊళ్లలో వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో కూడా గల్లీగల్లీలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. అర్ధరాత్రి, అపరాత్రి కూడా మద్యం దొరుకుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే ఫోన్ చేస్తే చాలు మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. మరొకొన్ని గ్రామాల్లో బెల్టు షాపులు ప్రత్యేకంగా షెడ్లు వేసి, అక్కడ కూర్చుని మద్యం సేవించేందుకు కుర్చీలు, టేబుళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment