
అబుదాబిలో రోడ్డు ప్రమాదం.. తొర్తివాసి మృతి
మోర్తాడ్(బాల్కొండ): దుబాయ్ దేశంలోని అబుదాబి నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన ఈర్గల గంగాధర్(44) మరణించినట్లు అతని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఉపాధి కోసం అబుదాబిలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న గంగాధర్.. శనివారం బైక్‌పై డ్యూటీకి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గంగాధర్‌కు భార్య, కూతురు, కొడుకు, తల్లి ఉన్నారు. గతంలో గీతా కార్మికునిగా పనిచేసిన గంగాధర్ ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టాడు. విధి వక్రీకరించి ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతదేహాన్ని త్వరగా రప్పించి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి..
బోధన్‌రూరల్: సాలూర మండలం జాడిజమాల్‌పూర్ గ్రామ శివారులోని చెరువు ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన రమేశ్ ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా గ్రామ శివారులోని చెరువులో కాలకృత్యాల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గ్యాస్ సిలిండర్ లీకేజీ.. ఒకరికి తీవ్రగాయాలు
రెంజల్(బోధన్): ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పైపు లీకేజీ కావడంతో మంటలు వ్యాపించి దంపతులకు గాయాలైన ఘటన రెంజల్ మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మోతీలాల్ ఇంట్లో మధ్యాహ్నం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పైపు లికేజీ అయ్యి రెగ్యులేటర్ పేలింది. దీంతో మంటలు వ్యాపించి మోతీలాల్‌కు తీవ్రగాయాలు కాగా, భార్య లతకు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బాలికపై లైంగిక దాడి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వేణు అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశామన్నారు. గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ విచారణ నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment