ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం : జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగిలో 6.20 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతుల ఇంటి అవసరాలు పోను కొనుగోలు కేంద్రాలకు 5.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని భావిస్తున్నామన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. వరి కోతలు ప్రారంభమై ధాన్యం వచ్చిన ప్రాంతాలలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రాలలో తగినన్ని టార్ఫాలిన్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి కేంద్రంలో రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఓఅర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, టెంట్లు వేయాలని సూచించారు. తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్, గన్నీ బ్యాగులను సిద్ధం చేయాలన్నారు. వడ్లకు కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2,300 చెల్లిస్తామని, సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ రూపంలో ఇస్తామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్ 08468–220051 ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, డీఎస్‌వో మల్లిఖార్జున బాబు, డీఏవో తిరుమల ప్రసాద్, మార్కెటింగ్ అధికారి రమ్య, డీటీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment