కరీంనగర్: ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ను ఆనుకొని ఉన్న కాకతీయ కాలువలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గల్లంతయ్యాడు. తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు.. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) శుక్రవారం సాయంత్రం కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లాడు. తినుబండారం తిని కాలువలో చేతులు కడుక్కునేందుకు మెట్ల నుంచి దిగాడు. చేతులు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.
స్థానికులు గమనించి అతడ్ని కాపాడేందుకు తాడు వేసినా సమయానికి అందుకోకపోవడంతో పాటు కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొట్టుకుపోయాడు. మల్లయ్య కరీంనగర్ భగత్‌నగర్‌లో నివాసం ఉంటూ హెడ్ కానిస్టేబుల్‌గా పెద్దపల్లి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. గతంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వద్ద గన్‌మెన్‌గా పని చేశాడు.
ఈత వచ్చినా..
దుండే మల్లయ్యకు 50 ఏళ్ల వయసు ఉన్నా యువకుడిలా యాక్టీవ్‌గా ఉండేవాడు. మృదుస్వభావి, మంచికి మారుపేరుగా ఉండడంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టుబట్టి అతడ్ని గన్‌మెన్‌గా పెట్టుకున్నారు. అతడికి ఈత వచ్చినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. గల్లంతు అయ్యే సమయంలో మత్స్యకారులు తాళ్లు విసిరివేసే క్రమంలో మల్లయ్య కొద్దిదూరం ఈత కొట్టినట్లు సమాచారం.
ఈదుకుంటూ కట్టవైపు రాకపోవడంతో అక్కడున్నవారు ఆందోళనకు గురయ్యారు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళుతూ మునిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కెనాల్‌లో నీటిని నిలిపివేసినా మల్లయ్య ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై మల్లయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment