వాళ్లకు ఇద్దరు కూతుళ్లు.. అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు.. రెండు బంగారు వడ్డాణాలు.. రెండు జతల బంగారు గాజులు.. ఇద్దరికీ కమ్మలు, బుట్టాలు.. ఎవరినీ తక్కువగా చూడలేదు.. అంతేకాదు.. వివాహాలకు అవసరమైన ఆభరణాలూ సిద్ధం చేశారు.. పెళ్లి సంబంధాలు చూడడంలో నిమగ్నమయ్యారు.. అంతలోనే పెద్దకూతురు ప్రాణాలు కోల్పోవడం.. చిన్నకూతురు జైలుకు వెళ్లడం ఆ దంపతులకు తీరని వేదన మిగిల్చింది.. సొంత అక్కనే హత్యచేసిన చెల్లెలు అని పోలీసుల విచారణలో తేలడంతో వారి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి–మాధవి కన్నీరుమున్నీరవుతున్నారు.
కోరుట్ల: బంక శ్రీనివాస్‌రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి సుమారు పాతికేళ్ల క్రితం ఉపాధి కోసం కోరుట్లకు వలస వచ్చారు. భార్య మాధవితో కలిసి చిన్నచితకా పనులు చేశారు. చివరకు ఇటుకబట్టీ వ్యాపారంలో స్థిరపడి మంచిపేరు తెచ్చుకున్నారు. ఈ దంపతులకు పెద్దకూతురు దీప్తి, చిన్నకూతురు చందన, కూమారుడు సాయి సంతానం. చిన్ననాటి నుంచి కూతుళ్లను అల్లారుముద్దుగా పెంచారు. ఇద్దరినీ బీటెక్ చదివించారు. నాలుగేళ్ల క్రితం దీప్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పుణేలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. చందన ఇటీవల బీటెక్ పూర్తిచేసింది. కొడుకు సాయి బెంగళూర్‌లో డిగ్రీ చదువుతున్నాడు. పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాతికేళ్లుగా కష్టపడుతున్న శ్రీనివాస్‌రెడ్డి దంపతులు.. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లకు వివాహం చేయడానికి ఆర్నెల్లుగా మంచిసంబంధాలు చూస్తున్నారు.
పెళ్లిళ్ల కోసం స్థలాలు విక్రయించి..
► ఇటుకబట్టీ వ్యాపారంలో అంతోఇంతో సంపాదించిన శ్రీనివాస్‌రెడ్డి.. తాను కొనుగోలు చేసిన స్థలాలను ఇటీవల విక్రయించారు.
► ఇలా తన కూతుళ్లు దీప్తి, చందన వివాహాల కోసం డబ్బు, నగలు సమకూర్చుకున్నారు.
► సుమారు రూ.90 లక్షలు వెచ్చించి పెళ్లిళ్లకు అవసరమైన వడ్డాణాలు, చైన్‌లు, కమ్మలు, బుట్టాలు, హారాలు తయారు చేయించారు.
► వీటితోపాటు కొంత నగదు సిద్ధం చేసుకున్నారు.
► తన సొంతూరు నెల్లూరుకు వెళ్లి మంచి సంబంధాలు చూస్తున్నారు.
► ఇంతలోనే దీప్తి హత్య ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది.
విశ్రాంతి తీసుకునే సమయంలో విషాదం..
కూతుళ్లకు వివాహం చేసి విశ్రాంతి తీసుకుందామని యోచించిన శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు దీప్తి హత్య షాక్ ఇచ్చింది. పెద్దకూతురు హత్యకు గురికావడమే కాకుండా.. చంపింది చిన్నకూతురే కావడం నివ్వెరపరిచింది. అంతేకాదు.. పెళ్లిళ్ల కోసం తాను సమకూర్చిన నగలు, నగదు తీసుకుని చందన ప్రియుడితో పరారైన వైనం శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు ఆశనిపాతంగా మారింది. ప్రస్తుతం దీప్తి హత్యకు గురికావడం, అక్కను హత్యచేసి జైలుపాలు కావడంతో శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం శోసంద్రంలో మునిగింది. ఇద్దరు కూతుళ్లు దూరం కావడంతో కుటుంబంలోనే కాదు.. పట్టణంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment