సాక్షి, కరీంనగర్: తన భర్తను అడ్డు తొలగిస్తే.. సింగరేణి ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరం హాయిగా ఉండొచ్చని చెప్పి ప్రియుడితో భర్తను హత్య చేయించింది ఓ మహిళ. అంతేకాదు.. తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించింది కూడా.. రంగంలోకి దిగిన పోలీసులు.. కూపీ లాగడంతో అసలు విషయం వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసుస్టేషన్ పరిధిలోని మల్యాలపల్లి సబ్‌స్టేషన్ వద్ద రాజీవ్‌రహదారిపై జరిగిన ఈ ఘటన వివరాలను రామగుండం ఏసీపీ తులా శ్రీనివాస్‌రావు బుధవారం విలేకరులకు వెల్లడించారు.
ఆయన కథనం ప్రకారం.. గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ సమీప పోతనకాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి లావుడ్య మధుకర్–రమ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. రమ తనకు తెలిసిన వారికి పెళ్లి సంబంధం కుదిర్చేక్రమంలో ధరావత్ గోవర్ధన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది గోవర్ధన్, రమ మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈక్రమంలో గోవర్ధన్ తరచూ రమ ఇంటికి వస్తూ పోతున్నాడు. కొన్నిసార్లు రెండుమూడ్రోజులు ఇక్కడే ఉండేవాడు. దీంతో మధుకర్‌కు తన భార్యపై అనుమానం వచ్చింది.
పద్ధతి మార్చుకోవాలని ఆమెను హెచ్చరించాడు. తన వ్యవహారానికి అడ్డువస్తున్నాడనే ఆగ్రహంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి రమ కుట్ర పన్నింది. మధుకర్‌ను చంపితే సింగరేణి ఉద్యోగం కూడా వస్తుందని, ఇద్దరమూ హాయిగా ఉండొచ్చని చెప్పింది. ఇందుకు అంగీకరించిన గోవర్ధన్.. మరో ఇద్దరు మిత్రుల సాయం తీసుకుని మధుకర్ హత్యకు అక్టోబర్ 29న ప్లాన్ చేశాడు. అదేరోజు మధుకర్ మధ్యాహ్నం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న గోవర్ధన్ తన స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్‌తో కలిసి గోదావరిఖని వచ్చారు.
గోవర్ధన్ తన ప్రియురాలు రమకు ఫోన్‌చేశాడు. మధుకర్‌తో మాట్లాడాలని చెప్పాడు. ఈక్రమంలో పల్సర్ బైక్‌పై ఫైవింక్లయిన్ వద్ద గల ఓ వైన్‌షాపులోకి మధుకర్ వచ్చాడు. అక్కడ అందరూ కలుసుకొని మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత మల్యాలపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని చెట్లపొదల్లోకి వచ్చి మద్యం తాగుతూ ఉన్నారు. గోవర్ధన్ తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడు పట్టుకుని, తన ఇద్దరు మిత్రులతో కలిసి మధుకర్‌పై దాడిచేశారు. తీవ్రగాయాలతో మధుకర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతదేహాన్ని రోడ్డు పక్క ఉన్న కాలువలో పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు బైక్‌ను మృతదేహంపై పడేయాలని యత్నించినా.. అదుపుతప్పి పక్కకు పడింది. ఆ తర్వాత హత్య విషయాన్ని గోవర్ధన్ వాట్సాప్‌కాల్ ద్వారా రమకు తెలిపాడు. అక్కడినుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు. రమ వ్యవహారశైలిపై మృతుడి తండ్రి నాన్యానాయక్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితులు లావుడియా(నునసవత)రమ, ధరావత్ గోవర్ధన్(నాచారం, మల్హర్ మండలం), కోట లక్ష్మణస్వామి (కొత్తపల్లి, జయశంకర్ జిల్లా), కర్నే నాగరాజు (ఖాసీంపెల్లి, జయశంకర్ జిల్లా)ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. హత్య జరిగిన 48 గంటల్లోనే రామగుండం సీఐ, ఎస్సైలు కేసును ఛేదించడంతో ఏసీపీ అభినందించారు.
ఇవి చదవండి: చిన్నారిని కుదిపేసిన కాలం!
Comments
Please login to add a commentAdd a comment