కరీంనగర్ కార్పొరేషన్: ‘ఈ రోజు ఎవరట’.. నగరంలో ఇటీవల తరుచూ వినిపిస్తున్న పదం ఇది. భూ కబ్జాలపై ఫిర్యాదులు పెరుగుతుండగా, ఏ రోజుకారోజు కొత్తగా ఓ కార్పొరేటర్ పేరు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ పదం చాలా పాపులరైంది. నగర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భూ కబ్జాలపై కొనసాగుతున్న ఫిర్యాదులు.. విచారణ.. అరెస్ట్‌లు నగరపాలకసంస్థలో తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.
వందల సంఖ్యలో ఫిర్యాదులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, గత బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై ఫిర్యాదులు ఆహ్వానించడం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసు కమిషనర్ భూ ఆక్రమణలపై విచారణకు ఏసీపీల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించారు. భూ కబ్జాలపై ఫిర్యాదులు స్వీకరిస్తుండడంతో, వందలాది మంది బాధితులు ధైర్యంగా పోలీసుస్టేషన్ల తలుపు తడుతున్నారు. నగరవ్యాప్తంగా ఈ ఫిర్యాదులు వస్తుండగా ప్రధానంగా శివారు డివిజన్ల నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఫిర్యాదుల్లో 90శాతం స్థానిక ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లపైనే కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
మరికొంతమందిపైనా విచారణ
ప్రజల చేత ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ల చుట్టూనే భూ కబ్జాల ఫిర్యాదులు తిరుగుతుండడం గమనార్హం. రోజురోజుకు భూ ఫిర్యాదులు పెరుగుతుండగా, ఆ ఫిర్యాదుల్లో ఎక్కడో ఒక చోట ఎవరో ఒక కార్పొరేటర్ పేరు బయటకు వస్తోంది. దీంతో సదరు కార్పొరేటర్లను ఎప్పటికప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగించిన భూదందాలు వెలుగు చూస్తుండగా, ఫిర్యాదులు వస్తున్న తీరు చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. మంగళవారం నాటికి దాదాపు 15మంది వరకు కార్పొరేటర్లపైన ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందులో కొంతమంది భూ ఆక్రమణలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండగా, మరికొంతమంది మాత్రం ‘పంచాయితీ’ చేసే క్రమంలో ఇరుక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ డివిజన్‌లలో ఇరు వర్గాల నడుమ నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు గతంలో చేసిన పంచాయితీలు ఇప్పుడు భూ ఫిర్యాదుల రూపంలో వస్తున్నట్లు ఒకరిద్దరు కార్పొరేటర్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
కార్పొరేటర్ రివర్స్‌గేర్
నగరంలో భూ ఆక్రమణలపై కార్పొరేటర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా, 18వ డివిజన్ కార్పొరేటర్ సుదగోని మాధవి కృష్ణాగౌడ్ మాత్రం రివర్స్‌గేర్ వేశారు. తమ డివిజన్ రేకుర్తి పరిధిలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలంటూ ఎస్‌ఆర్‌ఎస్‌పీ, రెవెన్యూ, నగరపాలకసంస్థ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. సర్వే చేయించి కెనాల్ భూములను కాపాడాలంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఏదేమైనా నగరచరిత్రలో తొలిసారిగా భూ ఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడం, భూ దందాల్లో రోజుకో కార్పొరేటర్ పేరు వినిపిస్తుండడం నగరంలో తీవ్రచర్చకు దారితీస్తోంది.
ఇప్పటికే ఇద్దరు జైలుకు
భూ కబ్జాలపై ఫిర్యాదు చేయండి.. విచారణ జరిపి మీ భూములు మీకిప్పిస్తాం.. అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందుకు అనుగుణంగా సీపీ ప్రత్యేక బృందాలను ఆచరణలోకి దింపారు. దీంతో భూ బాధితుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతానికి భిన్నంగా ఫిర్యాదులు, విచారణ, చర్యలు కూడా వేగంగా జరుగుతుండడం ప్రస్తుతం ఆసక్తికర పరిణామం. భగత్‌నగర్, సీతారాంపూర్‌లలో భూ ఆక్రమణలు, దౌర్జన్యాల ఫిర్యాదులపై 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, 21వ డివిజన్ కార్పొరేటర్ జంగిలి సాగర్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపండం తెలిసిందే. ఇందులో తోట రాములు బెయిల్‌పై విడుదల అయ్యారు. వీరే కాకుండా ఒకరిద్దరు కార్పొరేటర్లు కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment