భయపెడుతున్న జీబీ సిండ్రోమ్‌ | - | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న జీబీ సిండ్రోమ్‌

Published Sun, Feb 16 2025 1:43 AM | Last Updated on Sun, Feb 16 2025 1:42 AM

భయపెడ

భయపెడుతున్న జీబీ సిండ్రోమ్‌

సాక్షి ఫ్యామిలీ హెల్త్‌ డెస్క్‌

గులియన్‌ బ్యారి సిండ్రోమ్‌ (జీబీఎస్‌) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్‌ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.

తక్కువ ఖర్చుతో చికిత్స

ఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే వారికి తగిన మోతాదులో ఐదు రోజులపాటు ఇమ్యూనో గ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి దేహంలో మైలీన్‌ పొరను ధ్వంసం చేసే యాంటీబాడీస్‌ను బ్లాక్‌ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. మరో పద్ధతిలో రోగి బరువును బట్టి ప్రతి కిలోగ్రాముకు 250 ఎంఎల్‌ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం మేలు.

–డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్‌ న్యూరో ఫిజీషియన్‌

● ఏదైనా వైరల్‌ లేదా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన తర్వాత పోస్ట్‌ వైరల్‌ లేదా పోస్ట్‌ బ్యాక్టీరియల్‌ వ్యాధిగా కనిపించేదే జీబీఎస్‌.

● మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికి ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్‌ అనే పొర ఉంటుంది. యాంటీబాడీస్‌ ఈ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి సిగ్నల్స్‌ అందక అవయవాలు అచేతనమవుతాయి.

● మొదట కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా దేహమంతా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతన మైతే కళ్లు కూడా మూయలేడు.

● ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్‌ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది.

● గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం వస్తుంది. మైలీన్‌ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితులు క్రమంగా కోలుకుంటారు. ఆ ప్రక్రియ రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు.

● శరీరంలో పొటాషియం లేదా కాల్షియం పాళ్లు తగ్గినా జీబీఎస్‌ లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. కాబట్టి జీబీ సిండ్రోమ్‌ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి.

● కలుషిత నీరు, ఆహారమే జీబీఎస్‌ రావటానికి ప్రధాన కారణమని గుర్తించారు.

జీబీ సిండ్రోమ్‌ లక్షణాలు

No comments yet. Be the first to comment!
Add a comment
భయపెడుతున్న జీబీ సిండ్రోమ్‌ 1
1/1

భయపెడుతున్న జీబీ సిండ్రోమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement