
రాయితీ ట్రాక్టర్ల పేరిట మోసం
● రూ.26 లక్షలు కాజేసిన వైనం
● ముగ్గురు నిందితుల అరెస్టు
పెగడపల్లి: మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆరుగురు రైతులను రాయితీ టాక్టర్ల పేరిట మోసగించిన ముగ్గురు వ్యక్తులను పెగడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం మల్యాల సీఐ రవి, ఎస్సై రవికిరణ్‌తో కలిసి డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. పెగడపల్లి మండలం బతికపల్లికి చెందిన మన్నె మల్లేశం, చింతకంది కిశోర్, మంచిర్యాలకు చెందిన కామెర చంద్రమౌళి ముఠాగా ఏర్పడ్డారు. ఇదే మండలం నందగిరి, బతికపల్లికి చెందిన ఆరుగురు రైతులకు న్యాప్స్ సంస్థ నుంచి 40 శాతం రాయితీపై ట్రాక్టర్లు ఇప్పిస్తామని రూ.36 లక్షలు వసూలు చేశారు. ఇందులోంచి గంగాధరలోని శ్రీవెంకటసాయి ఎంటర్ ప్రైజెస్ ట్రాక్టర్ షోరూం వారికి రూ.10 లక్షలు చెల్లించి ఆరు ట్రాక్టర్లు ఇప్పించారు. మిగిలిన రూ.26 లక్షలు పంచుకున్నారు. ట్రాక్టర్లకు నెలనెలా వాయిదాల ప్రకారం డబ్బులు చెల్లిస్తామని రైతులకు తెలపకుండా.. రాయితీపై అని చెప్పి.. అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. కొద్ది రోజుల తరువాత ట్రాక్టర్ షోరూం యాజమాన్యం కిస్తీల ప్రకారం డబ్బులు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తోంది. దీంతో తాము మోసపోయిన విషయాన్ని గ్రహించిన రైతులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు విచారణ చేపట్టారు. మంచిర్యాలలో ఇదే తరహాలో నాప్స్ సంస్థ పేరుతో గతేడాది కామెర చంద్రమౌళి రైతులను మోసం చేయడంతో కేసు నమోదైనట్లు గుర్తించారు. రాయితీ ట్రాక్టర్ల పేరిట రైతులను మోసగించిన వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. ట్రాక్టర్ షోరూం నిర్వాహకుల పాత్రపైనా విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment