సాధారణ ప్రసవాలకే మొగ్గు
● పెరుగుతున్న నార్మల్ డెలివరీలు ● ఎంసీహెచ్‌లో ప్రసవానికి పలువురి ఆసక్తి ● ఉద్యోగులూ ప్రభుత్వాసుపత్రికి వస్తున్న వైనం ● సౌకర్యాలు సరిపడక కొందరు వెనకడుగు ● వచ్చేది వేసవికాలం.. ఏసీలు లేక ఆగమాగం ● టీవీవీపీ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతతో ఇబ్బంది
కరీంనగర్‌టౌన్: జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం 16 శాతం మాత్రమే నార్మల్ డెలివరీలు జరగడం గమనార్హం. గతేడాది జనవరి నుంచి ఈ జనవరి వరకు ప్రభుత్వాసుపత్రిలో 2,345 సాధారణ, 5,244 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. అంటే 37 శాతం సాధారణ ప్రసవాలే. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో 599 నార్మల్, 3,179 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. అంటే 15 శాతం మాత్రమే సాధారణ ప్రసవాలు. సాధారణ ప్రసవాలతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారని, వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈక్రమంలో భవిష్యత్‌లో వచ్చే అనర్థాలను గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు వివరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల వైపు మొగ్గుచూపేలా చూస్తున్నారు.
ప్రైవేటులో సిజేరియన్‌లే..
జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 15 శాతం మాత్ర మే నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో సాధారణ ప్రసవాలు చేసుకోవాలనే ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఒత్తిడి పెరుగుతోంది.
టీవీవీపీ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో డెలివరీలు చేయాలని పలుమార్లు జిల్లా కలెక్టర్‌లను సైతం సమీక్ష సమావేశాల్లో ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, టీవీవీపీ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరిగితే ఎంసీహెచ్‌పై ఒత్తిడి తగ్గడమే కాకుండా సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అయితే, టీవీవీపీ ఆసుపత్రులైన హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, మానకొండూర్‌లలో సౌకర్యాలు, మెషినరీ, సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీవీవీపీ సిబ్బంది కరీంనగర్ జీజీహెచ్‌లో తిష్టవేయడంతో ఆయా ఆసుపత్రుల్లో కొరత ఏర్పడుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు సిబ్బందిని ఏర్పాటు చేస్తే ప్రసవాలు పెరిగే అవకాశం ఉంది.
సౌకర్యాలు లేక..
జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌లో ప్రతినెలా సుమారు 650 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. ఇందులో 37 శాతం ప్రసవాలు సాధారణమే అవుతుండడం గమనార్హం. అయితే ఆసుపత్రిలో సౌకర్యాలపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. వేసవికాలం వచ్చిందంటే డెలివరీలు అయిన మహిళలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పిల్లలు ఉగ్గపట్టి ఏడుస్తుంటారు. ఏసీలు లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో సొంతగా ఫ్యాన్లు తెచ్చిపెట్టుకున్న సందర్భాలున్నాయి.
అద్దె గదుల్లోనూ అదే పరిస్థితి
ఎంసీహెచ్‌లో 33 అద్దెగదులున్నాయి. డెలివరీలు అయిన తర్వాత రూ.500 అద్దెతో గదులు ఇస్తుంటా రు. వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ అద్దెగదుల్లో కూడా ఫ్యాన్లు మాత్రమే ఉండడం ఇబ్బందికరంగా మారుతోంది. కనీసం అద్దె గదుల్లోనైనా ఏసీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మరిన్ని అద్దెగదులు ఏర్పాటు చేసినా పోటీ తగ్గే పరిస్థితి లేదు. ఏసీలు ఏర్పాటు చేస్తే మాత్రం పేద, మధ్యతరగతి ప్రజలే కాకుండా ఉన్నతవర్గాలు, ఉద్యోగులు సైతం డెలివరీల కోసం ఎంసీహెచ్ గడపతొక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మాతాశిశు ఆరోగ్య కేంద్రం
అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
ఎంసీహెచ్‌లో డెలివరీల కోసం వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా ఇప్పటి వరకు రిపేర్‌లో ఉన్న ఏసీలన్నీ రిపేరు చేయించి వర్కింగ్ కండీషన్‌లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. మరో 30 కొత్త ఏసీలు వచ్చే అవకాశం ఉంది. అవి వస్తే వేసవిలో బాలింతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
– డాక్టర్ వీరారెడ్డి,
ఆసుపత్రి సూపరింటెండెంట్
జిల్లాలో 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు..
మొత్తం ప్రభుత్వాసుపత్రుల్లో.. ప్రైవేటు ఆసుపత్రుల్లో..
డెలివరీలు 11,367 7,589 3,778
సాధారణ 2,944 2,345 599
సిజేరియన్ 8,423 5,244 3,179
నార్మల్ వైపు ఉన్నతవర్గాల చూపు
ప్రైవేటు ఆసుపత్రులు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ సంబంధం లేని కారణాలు చెప్పి, అవసరమైతే భయపెట్టి కేవలం డబ్బుల కోసమే సిజేరియన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలే కాకుండా, ఉన్నతవర్గాలు, ఉద్యోగుల కుటుంబాలు సైతం నార్మల్ డెలివరీలపై ఆసక్తితో ప్రభుత్వ ఆసుపత్రి బాట పడుతున్నారు. సాధారణ ప్రసవాలతో మహిళలు ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పడం కూడా ఇందుకు కారణం.
సాధారణ ప్రసవాలకే మొగ్గు
సాధారణ ప్రసవాలకే మొగ్గు
Comments
Please login to add a commentAdd a comment