మూలన పడేశారు
● నగరపాలక ఉద్యోగుల నిర్లక్ష్యం ● బల్దియాలో వృథాగా ఫ్రీజర్లు
కరీంనగర్‌కార్పొరేషన్: వాహనాలు, పరికరాలను వినియోగించడంలో, పనులు చేయడంలో నగరపాలకసంస్థ ఉద్యోగుల నిర్లక్ష్యానికి అంతుండడం లేదు. ఉద్యోగుల నిర్లక్ష్యంపై ఎన్నిమార్లు ఫిర్యాదులు వచ్చినా, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. వాహనాలు, పరికరాలు చిన్న మరమ్మతుకు గురైనా, మూలనపడేసి అవి పూర్తిగా పనికిరాకుండా చేయడంలో బల్దియా అధికారులు, ఉద్యోగులది ఒక ప్రత్యేకత. నగరంలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమయాత్రకు నగరపాలకసంస్థ నుంచి వైకుంఠరథం, ఫ్రీజర్లను సమకూరుస్తారు. గతంలో రూపాయికే అంతిమసంస్కారం ప్రవేశపెట్టగా, అంతిమయాత్రకు వేల రూపాయలు ఖర్చు చేయలేని నగరంలోని నిరుపేదలకు అది ఒక వరంలా మారింది. కానీ, ఈ పథకం నిర్వహణలో మాత్రం అధికారులు తరచూ విఫలమవుతూ వస్తున్నారు. ఇప్పటికే వైకుంఠరథాలు సరైన మరమ్మతుకు నోచుకోవడం లేదు. కొద్ది రోజులు పనిచేస్తే, మరికొన్ని రోజులు షెడ్‌కే పరిమితమవుతున్నాయి. తాజాగా మృతదేహాలను భద్రపరిచే రెండు ఫ్రీజర్లను నగరపాలకసంస్థ కార్యాలయంలో వృథాగా పడవేశారు. అంతిమసంస్కారానికి ముందు కొన్ని గంటల పాటు మృతదేహం చెడిపోకుండా ఉండేందుకు ఉపయోగించే ఫ్రీజర్లు నగరపాలకసంస్థ కార్యాలయంలో ఓ పక్కన వృథాగా పడవేయడంపై సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఫ్రీజర్లు పనిచేయని పక్షంలో మరమ్మతు చేసి ఉపయోగించాల్సిన అధికారులు, పట్టించుకోకుండా పక్కన పడవేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఉపయోగించకపోతే ఎవరైనా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు ఫ్రీజర్లు అప్పగిస్తే బాగుండేదని, వృథాగా పడేయడంతో అవి పూర్తిగా పనికిరాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నగరపాలకసంస్థ ఉన్నాధికారులు రెండు ఫ్రీజర్లను వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment