వికసిత్ లక్ష్యాల సాధనలో మైనింగ్ పాత్ర కీలకం
● ఎంఈఏఐ జాతీయ సదస్సులో సింగరేణి సీఎండీ బలరాం
గోదావరిఖని: మన దేశాన్ని 2047 నాటికి అగ్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌దక్కన్‌లో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో ‘ఖనిజ అన్వేషణ: ఆత్మనిర్భర్ వికసిత భారత్–2047 వైపు ముందడుగు’ అంశంపై రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పోత్సాహంతో క్రిటికల్ మినరల్ రంగం అన్వేషణలో ఉన్న అవకాశాలపై సింగరేణి అధ్యయనానికి చర్యలు తీసుకుంటునట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా మైనింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం, బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయించడం ద్వారా ఈ రంగంపై దృష్టిసారిస్తోందన్నారు. లిథియం, కోబాల్ట్, నికెల్ తదితర అరుదైన ఖనిజాల అన్వేషణ చేపట్టడం ద్వారా భవిష్యత్ టెక్నాలజీ వృద్ధికి దోహదపడిన వాళ్లమవుతామన్నారు. ముఖ్యంగా మన దేశాన్ని 2070 నాటికి నెట్ జీరోగా మార్చాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ అరుదైన ఖనిజాల అన్వేషణ ప్రస్తుతం అత్యంత అవసరమన్నారు. సింగరేణి జీఎం(కోఆర్డినేషన్) ఎస్‌డీఎం.సుభాని, ఎంఈఏఐ సభ్యులు, మైనింగ్ రంగ నిపుణులు పాల్గొన్నారు.
దొంగ అరెస్ట్
మెట్‌పల్లిరూరల్: దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తెలిపారు. మేడిపల్లి శివారులోని ఇబ్రహీంపట్నం క్రాసింగ్ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు విషయాలను చెప్పాడు. గతేడాది డిసెంబర్ రెండున మేడిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడిని కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన తూర్పాటి కనకయ్యగా పోలీసులు వెల్లడించారు. కనకయ్య ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లో కూడా దొంగతనాలు చేశాడని, జైలుకు కూడా వెళ్లొచ్చాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment