డేంజర్ స్పాట్స్
● సీఎంఏ పనుల పెండింగ్ ఎఫెక్ట్
● తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు
● ఏడాది దాటినా కదలని అసంపూర్తి పనులు
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్‌సిటీలో భాగంగా నగరంలోని అంతర్గత రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ పథకం కింద రూ.132 కోట్లు కేటాయించి గతంలో పనులు మొదలు పెట్టారు. ఈ పనులు ప్రారంభదశలో ఉండగానే, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2023 డిసెంబర్‌లో కాంట్రాక్టర్ ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశాడు. అప్పటి నుంచి సీఎంఏ పనులు చేపట్టిన ప్రాంతవాసులు నిత్యం ఇక్కట్లు పడుతున్నారు. పాత రోడ్లను తొలగించడంతో పాటు, ఇళ్ల ఎదుట డ్రైనేజీ కోసం తవ్వి వదిలివేయడంతో ఏడాదిగా ఇబ్బంది పడుతున్నారు.
ప్రమాదకరంగా రోడ్డు
కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వైపు మెయిన్‌రోడ్డులో సగం వరకు సీసీ రోడ్డు వేశారు. మిగితా సగం పాత రోడ్డును తవ్వి అలానే వదిలేశారు. పూర్తయిన రోడ్డులో కూడా డ్రైనేజీ నిర్మాణం పూర్తిగా జరగలేదు. డ్రైనేజీల కనెక్టివిటీ వద్ద పరిస్థితి మరింత భయంకరంగా మారింది. రోడ్డుకు అడ్డుగా రెండు గుంతలు ఏర్పడడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. రాత్రి వేళల్లో ఈ పరిస్థితి భయానకంగా ఉంటోంది. ఇక జ్యోతినగర్ మోర్ సూపర్‌మార్కెట్ నుంచి మంకమ్మతోట వైపు రోడ్డు నిర్మాణంలో భాగంగా పాత రోడ్డు, పాత డ్రైనేజీని తొలగించారు. కాని అలానే వదిలివేయడంతో ఇండ్లల్లోకి వెళ్లేందుకు ఆ ప్రాంత వాసులు ఏడాదిగా నానా తిప్పలు పడుతున్నారు. సర్కస్ గ్రౌండ్ ప్రక్క రోడ్డులోనూ ఇదే పరిస్థితి. కిసాన్‌నగర్, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్ మంకమ్మతోట, పోచమ్మవాడ తదితర చాలా ప్రాంతాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి.
మోక్షమెప్పుడో...
నగరంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తారంటూ ఏడాదిగా ప్రచారం జరుగుతున్నా చిన్న కదలిక ఉండడం లేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ అధికారులు చెబుతూ వస్తున్నా, అసలు ఎప్పుడు కదలిక మొదలవుతుందో స్పష్టత లేదు. ఆయా ప్రాంత వాసులు అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయారు. పెండింగ్ పనులు పూర్తి చేయకపోవడంలో జాప్యం జరుగుతుండగా, ప్రమాదకరంగా ఉన్న చోట్ల నగరపాలకసంస్థ అధికారులు తాత్కాలిక మరమ్మతులు అయినా చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఏడాదికి పైగా నిత్యం ప్రమాదపుటంచుల్లో ప్రయాణిస్తున్న తమకు విముక్తి ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా నగర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సీఎంఏ పనులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని వేయికళ్లతో ఆయా ప్రాంతవాసులు ఎదురుచూస్తున్నారు.
నగరంలోని 9వ డివిజన్ అలకాపురికాలనీలో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకకు ఇతర ప్రాంతానికి చెందిన యువకుడు హాజరయ్యాడు. వేడుక ముగిసిన తరువాత, తన ద్విచక్ర వాహనంపై శ్రద్ధ ఇన్ లేన్ నుంచి మెయిన్‌రోడ్డు వైపు బయల్దేరాడు. రోడ్డు వెంట నేరుగా వచ్చిన ఆ యువకుడు అకస్మాత్తుగా ముగిసిన రోడ్డును చూసి తికమక పడడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. బైక్ పక్కకు పడడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. నగరంలో ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) నిధులతో చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ పనులను సగంలోనే వదిలివేయడంతో నెలకొన్న పరిస్థితికి ఇది తాజా నిదర్శనం. ఎన్‌టీఆర్ విగ్రహం ఎదురుగా సిరిసిల్ల బైపాస్ రోడ్డు, శ్రద్ధ ఇన్ లేన్ వద్ద సీఎంఏ పనులు చేపట్టిన కాంట్రాక్టర్, సంవత్సరం క్రితం నిలిపివేశాడు. అంతర్గత రోడ్డు ఎత్తులో ఉండడం...మెయిన్‌రోడ్డు దిగువలో ఉండడం... కింద ఉన్న డ్రైనేజీని అసంపూర్తిగా వదిలివేయడం...ఐరన్‌రాడ్లు తేలి ఉండడంతో అది డేంజర్ స్పాట్‌గా మారింది. ఏడాదిలో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.
డేంజర్ స్పాట్స్
డేంజర్ స్పాట్స్
Comments
Please login to add a commentAdd a comment