సిరిసిల్ల: ఐపీ.. ఇన్‌సాల్వెన్సీ పిటిషన్. దీన్నే దివాళా పిటిషన్ అంటారు. ఇప్పుడిది ఫ్యాషన్ అయిపోయింది. ఒకరిని మరొకరు ఆదర్వంగా తీసుకున్నట్లు కోట్ల రూపాయల అప్పు తీసుకోవడం.. ఐపీ పెట్టి పరారవుతుండటంతో అప్పులిచ్చినవారు లబోదిబోమంటున్నారు. అదే సమయంలో నిజంగా డబ్బులు అవసరం ఉన్నవారు అప్పు పుట్టక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లాలో వరుసగా ఐపీలు పెట్టినవారు తీసుకున్న డబ్బులు దాదాపు రూ.50 కోట్లు.
102 మందికి నోటీసులు
సిరిసిల్ల గోపాల్‌నగర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించే ఓ యువకుడు రూ.3.50 కోట్లకు ఐపీ దాఖలు చేశాడు. స్థానికంగా 102 మందికి సంబంధిత నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో చిన్న వ్యాపారులు, పెద్ద వ్యాపారులతోపాటు రిజిస్టర్డ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, చిట్‌ఫండ్ కంపెనీలు ఉన్నాయి. ఎప్పుడూ బిజీగా నడిచే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను రూ.25 లక్షలకు అమ్మేసి, సదరు వ్యక్తి ఊరు విడిచి వెళ్లినట్లు సమాచారం.
హోటళ్లు, రెస్టారెంట్ల బిజినెస్..
గోపాల్‌నగర్‌కు చెందిన రమేశ్, నెహ్రూనగర్‌కు చెందిన వడ్డేపల్లి లక్ష్మీకాంత్ హైదరాబాద్ కేంద్రంగా హోటళ్లు, రెస్టారెంట్ల బిజినెస్ చేస్తున్నారు. హైదరాబాద్, గజ్వేల్, కొంపల్లి, సుచిత్ర ప్రాంతాల్లో రెస్టారెంట్లు ప్రారంభించారు. సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోనూ 3 నెలల కిందట ఏర్పాటు చేశారు. స్థానికంగా పలువురి వద్ద రూ.లక్ష చొప్పున అప్పు తీసుకొని, నెలకు రూ.5 వేల చొప్పున వడ్డీ ఇస్తూ నమ్మకంగా మెదిలారు. దీంతో లక్ష్మీకాంత్‌ను నమ్మి చాలామంది భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. అయితే, అతని ఫోన్ డిసెంబర్ 6న స్విచ్‌ఆఫ్ అయ్యింది. ఢిల్లీ వెళ్లిన లక్ష్మీకాంత్ ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య అర్పిత అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిరిసిల్లలో అప్పు ఇచ్చినవారు నెహ్రూనగర్‌లోని అతని ఇంటికెళ్లి, ఆరా తీశారు. సిరిసిల్లతోపాటు హైదరాబాద్‌లో లక్ష్మీకాంత్‌కు రూ.కోట్లలో అప్పులున్నట్లు భావిస్తున్నారు. అల్వాల్ పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
మరికొందరు దివాళా తీసినట్లు ప్రచారం
స్థానికంగా మరికొందరు వ్యాపారులు దివాళా తీసినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకుండా.. తప్పించుకు తిరుగుతున్నవారి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ కౌన్సిలర్ భర్త సైతం దివాళా తీసి, ఐపీ దాఖలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలిసింది. అంతకుముందు మరో వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడగా.. అతన్ని నమ్మి, అప్పులిచ్చినవారు ఎలా రాబట్టుకోవాలో తెలియక తల పట్టుకుంటున్నారు.
ఆర్థిక సంక్షోభంలో కార్మిక క్షేత్రం
సిరిసిల్లలో ఏడాదిగా వస్త్రోత్పత్తిలో సంక్షోభం, టెక్స్‌టైల్ పార్క్‌లో పనులు సరిగా లేక సాంచాలు నడవడం లేదు. కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వరుసగా ఐపీల సంఘటనలు వెలుగు చూస్తుండటంతో అప్పులు పుట్టని పరిస్థితి నెలకొంది. వ్యాపారులు, ఫైనాన్స్ నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు. వడ్డీ ఆశకు అప్పులిస్తే.. అసలుకే ఎసరు వచ్చిందని వాపోతున్నారు. మరోవైపు కోర్టు నుంచి ఐపీ నోటీసులు వస్తే ఊరిలో పరువు పోతుందని భయపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.
పరారవుతున్న రుణ గ్రహీతలు
వడ్డీ ఆశతో ‘అసలు’కే మోసం
మూడు ఘటనలు.. రూ.50 కోట్లు
లబోదిబోమంటున్న అప్పులిచ్చినవారు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో పరిస్థితి
Comments
Please login to add a commentAdd a comment