దివ్యాంగులకు శాశ్వత గుర్తింపు
● యూనిక్ డిజేబులిటీ ఐడీ జారీకి కేంద్రం శ్రీకారం
● కొనసాగుతున్న ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
● 21 రకాల వైకల్యం ఉన్నవారికి అవకాశం
కరీంనగర్‌టౌన్: దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలకు ఇప్పటివరకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. దీనికోసం మీసేవ కేంద్రాల్లో సదరం స్లాట్‌బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. అయితే సదరం సర్టిఫికెట్లకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. వీటిస్థానంలో యూడీఐడీ (యూనిక్ డిజేబులిటీ ఐడెంటిటీ కార్డు) అందించనుంది. ఈ మేరకు స్వావలంబన్‌కార్డు.జీవోవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచి ఫోన్ లేదా ఇంటర్నెట్ సెంటర్, మీసేవా కేంద్రాల్లో కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఇలా..
ఆన్‌లైన్‌లో స్వావలంబన్‌కార్డు.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అప్లయ్ బటన్‌పై క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకుని తరువాత అంగీకరిస్తూ సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దివ్యాంగులు వారికి చెందిన పూర్తి సమాచారం అక్కడ అడిగిన విధంగా నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. వైద్య పరీక్షలు అనతరం వెబ్‌సైట్‌లో ఆర్జీ స్టేటస్‌ను నిత్యం పరిశీలించుకోవచ్చు.
సేవలు సులభతరం
కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన యూడీఐడీ పోర్టల్‌తో సేవలు సులభతరం కానున్నాయి. ఇకపై సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యుడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి సదరం శిబిరాలకు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నంబర్‌కు వస్తుంది. దివ్యాంగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమయంలో ఎలాంటి తప్పులు, అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి.
21 రకాల వైకల్యాలకు అవకాశం
ఇప్పటి వరకు 7 రకాల వైకల్యం ఉన్న వారికే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే యూడీఐడీ పోర్టల్లో 21 రకాల వైకల్యాలను చేర్చారు. తలసేమియా, అటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీఐడీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సదరం శిబిరంలో వైకల్య నిర్ధారణ పూర్తయిన తరువాత సర్టిఫికెట్లను స్మార్ట్‌కార్డు రూపంలో పోస్టల్‌శాఖ ద్వారా ఇంటికే పంపించనున్నారు. ఈ కార్డు చేయూత పింఛన్లతోపాటు ఇతర అన్ని సంక్షేమ ప్రయోజనాలకు దేశవ్యాప్తంగా చెల్లుబాటవుతుంది. యూనిఫైడ్ ఐడీ కార్డులను ఆన్‌లైన్ నుంచే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కేంద్రం కల్పించింది.
త్వరలో శిబిరాల తేదీలు ఖరారు
సదరం సర్టిఫికెట్ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం నుంచి యూడీఐడీ (యూనిక్ డిజేబులిటీ ఐడెంటిటీ కార్డు)లు రానున్నాయి. త్వరలో శిబి రాలకు సంబందించిన తేదీ లు ఖరారు అవుతాయి. శిబిరానికి హాజరైన వారి కి స్మార్ట్‌కార్డు రూపంలో ఈ కార్డు అందజేస్తారు. దివ్యాంగులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు ఉండాల్సిందే. దివ్యాంగులంతా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని కార్డు పొందాలి.
– డాక్టర్ వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్
దివ్యాంగులకు శాశ్వత గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment