
ఈ ఆటో శిక్షణతో కొత్త అడుగు
తిమ్మాపూర్: మహిళల ఆర్థిక బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా సహకార సంస్థ, మోవో సొసైటీ సహకారంతో తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కేంద్రంలో 20 మంది మహిళలకు ఈ– ఆటో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. కలెక్టర్ సత్పతితో కలిసి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ ఆటో శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా బలపడతారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ శిక్షణతో చాలామంది ఉపాధి పొందుతున్నారని, రానున్న రోజుల్లో మొబైల్, టీవీ రంగాల్లోనూ శిక్షణ ఇస్తామని మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ శోభారాణి తెలిపారు. మహిళల రవాణా సేవలు సురక్షితంగా ఉంటాయని, కరీంనగర్ ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
‘రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన’
హుజూరాబాద్: రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ఇప్పలనర్సింగపూర్ గ్రామంలో గావో చలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని రాష్ట్రంలో అడుగబెట్టనివ్వని సీఎం చెబితే.. క్షేత్రస్థాయిలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో బీజేపీ గురించి హేళనగా మాట్లాడిన కేసీఆర్‌కు బీజేపీ శక్తి ఏంటో తెలిసి, ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారని గుర్తుచేశారు. నాయకులు తూర్పాటి రాజు, యాళ్ల సంజీవరెడ్డి, పైళ్ల వెంకట్‌రెడ్డి, పల్లె వీరయ్య, యాళ్ల లీల, బొడ్డు మహేశ్, గంగిశెట్టి ప్రభాకర్, పోతుల సంజీవ్ పాల్గొన్నారు.
సరస్వతి ఆలయంలో పల్లకీ సేవ
చొప్పదండి: పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో శనివారం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు ఊంజల్ సేవ నిర్వహించగా, ఆలయం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నదా నం నిర్వహించారు. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా ఆలయంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగరంలో పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: సబ్‌స్టేషన్లలో నెలవారి నిర్వహణలో భాగంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు 33/11 కె.వీ.శాతవాహన వర్సిటీ సబ్‌స్టేషన్ పరిధిలోని చింతకుంట, శ్రీరాంనగర్, మల్కాపూర్, కమాన్‌పూర్, గ్రానైట్ పరిశ్రమలు గల ప్రాంతాలు, 33/11 కె.వీ.కొత్తపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి, వెలిచాల, దేశ్‌రాజ్‌పల్లి, వెదిర గ్రామాలతో పాటు మిషన్ భగీరథ, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కె.వీ.నగునూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని నగునూర్, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి ప్రాంతాలు, 33/11 కె.వీ.మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ సబ్‌స్టేషన్‌ల పరిధిలోని నల్లకుంటపల్లి, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్, తాహెర్‌కొండాపూర్, దుబ్బపల్లి, చామన్‌పల్లి, జూబ్లీనగర్, ఫకీర్‌పేట, బహద్దూర్‌ఖాన్‌పేట, ఎలబోతారం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11కె.వీ.ఉజ్వల పార్కు ఫీడర్ పరిధిలోని ఎన్‌టీఆర్ విగ్రహం నుంచి ఉజ్వల పార్కురకు, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీ హబ్, ఐటీఐ కళాశాల, డీమార్ట్, గణేశ్‌నగర్ బైపాస్, తిరుమల థియేటర్, వసంత్‌వ్యాలీ స్కూల్, ధ్రువాసి కార్ఖానా, జెప్టో ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎ.లావణ్య తెలిపారు.

ఈ ఆటో శిక్షణతో కొత్త అడుగు