
పిచ్చికుక్క దాడిలో 14 మందికి గాయాలు
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో ఓ పిచ్చికుక్క 14 మందిపై దాడిచేసింది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలోకి వచ్చిన పిచ్చికుక్క వీధుల్లో వెళ్తున్న నలుగురిపై దాడిచేసింది. సోమవారం మధ్యాహ్నం కూడా మళ్లీ ఊళ్లోకి వచ్చి 10 మందిపై దాడిచేసింది. బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాళం వేసిన ఇళ్లలో చోరీ
ధర్మారం(ధర్మపురి): గోపాల్‌రావుపేట గ్రామంలో తాళం వేసిన మూడు ఇళ్లలో ఆదివారం రాత్రి చోరీ జరిగినట్లు ఎస్సై లక్ష్మణ్ సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన లింగాల ఆనందరావు బంధువుల ఇంట్లో పెళ్లి వేడుక కోసం తన ఇంటికి తాళం వేసి నాలుగు రోజుల క్రితం వెళ్లాడు. సోమవారం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా బీరువా ధ్వంసమై కనిపించింది. అందులోని మూడు తులాల బంగారు నక్లెస్ కనిపించలేదు. ఆనందరావు కుమారుడు అనిల్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన చింతల లక్ష్మారెడ్డి, కొమ్మ కనకయ్య తమ ఇళ్లకు తాళంవేసి ఊరెళ్లారు. వారి ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనానికి యత్నించారు. ఈ సంఘటనలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
గంజాయి స్వాధీనం
వేములవాడరూరల్: వేములవాడరూరల్ మండలం ఫాజుల్‌నగర్ శివారులో ముగ్గురు గంజాయి విక్రేతలపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన సాయికుమార్, రాకేశ్, బిహార్‌కు చెందిన సునీల్‌కుమార్ ఫాజుల్‌నగర్‌లో గంజాయి విక్రయించేందుకు వచ్చారు. పోలీసుల తనిఖీలో ముగ్గురి నుంచి 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
అదృశ్యమైన యువకుని బైక్ కెనాల్‌లో లభ్యం
మెట్‌పల్లి: మూడు రోజుల క్రితం అదృశ్యమైన పట్టణంలోని వెంకట్రావ్‌పేటకు చెందిన గొల్లెన రాకేశ్ (18) ద్విచక్ర వాహనం కోరుట్ల మండలం యెఖీన్‌పూర్ వద్ద ఎస్సారెస్పీ కెనాల్‌లో లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇంటర్ పూర్తి చేసిన రాకేశ్ ఈనెల 10న సాయంత్రం సమయంలో కథలాపూర్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో తల్లికి చెప్పి బైక్‌పై బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో మరుసటి రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆచూకీ కోసం వెతుకుతుండగా సోమవారం యెఖీన్‌పూర్ శివారులోని కెనాల్‌లో అతని బైక్ కనిపించింది. రాకేశ్ కెనాల్‌లో పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు రాకేశ్ చివరి కదలికలను సిరికొండ గ్రామంలోని సీసీ కెమెరాల్లో గుర్తించినట్లు సమాచారం.

పిచ్చికుక్క దాడిలో 14 మందికి గాయాలు