
ఐపీఎస్ రూప, ఐఏఎస్ రోహిణి
తన వాదనలను వినకుండా ఆంక్షలను విధించారని రూప దాఖలు చేసిన పిటిషన్
యశవంతపుర: ఐఏఎస్ అధికారి డి.రోహిణి సింధూరిపై ఐపీఎస్ అధికారి డి.రూప పరువు నష్టం కలిగించే ప్రకటనలను చేయరాదని కింది కోర్టు విధించిన ఆంక్షలను హైకోర్టు రద్దు చేసింది. తన వాదనలను వినకుండా ఆంక్షలను విధించారని రూప దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస హరీశ్‌కుమార్ ధర్మాసనం ఈ మేరకు రద్దు చేసింది.
కింది కోర్టు స్టే విధించిన తరువాత రోహిణి సింధూరి ఆ కోర్టులో సమర్పించిన పత్రాలను రూపకు అందించాలి. కానీ స్పీడ్ పోస్టులో పంపాం, స్టేని కొనసాగించాలని రోహిణి కోరారు. నోటీసులు పంపకుండా ఆంక్షలను అమలు చేస్తే అవి దానంతట అవే రద్దవుతాయని రూప తరఫున న్యాయవాది వాదనలు చేశారు.
ఏమిటీ కేసు
నెలన్నర కిందట రోహిణి సింధూరి వ్యక్తిగత ఫోటోలను రూప సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తీవ్రమైన ఆరోపణలు చేయడం తెలిసిందే. తరువాత ఇద్దరి మధ్య ప్రకటనల యుద్ధం నడిచింది. పత్రికలు, టీవీ చానెళ్లలో పతాక శీర్షికలకెక్కారు. దీంతో ప్రభుత్వం ఆగ్రహించి ఇరువురికీ ఏ బాధ్యతలు ఇవ్వకుండా బదిలీ చేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఐపీఎస్ రూపకు అనుకూలం అయ్యింది.