శివాజీనగర: సాధారణంగా ప్రతిసారి కర్ణాటక విద్యుచ్ఛక్తి నియంత్రణ కమిషన్ (కేఇఆర్‌సీ) ప్రజలకు షాక్ ఇస్తూ ఉండేది. అయితే ఇటీవలి నిర్ణయం వల్ల ఈ దఫా ప్రభుత్వానికి షాక్ కొట్టింది. కొన్ని వారాల కిందట ఖర్చులు, నిర్వహణ వ్యయం పెరిగినందున ప్రతి యూనిట్‌కు కనీసం 33 పైసల నుంచి 51 పైసలు పెంచింది. దీనిద్వారా మొత్తంలో గృహ వినియోగానికి అనుమతి ఇచ్చిన 14,090 మిలియన్ యూనిట్ విద్యుత్‌కు లెక్కించినపుడు సంవత్సరానికి సుమారు రూ.500 కోట్ల మేర వినియోగదారులపై భారం పడింది. ఈ భారం ఇప్పుడు ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. ఎందుకంటే నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తామని సర్కారు ప్రకటించింది. కనుక కొత్త చార్జీల పెంపు భారం భరించటం సర్కారుకు అనివార్యమైంది.
రూ.500 కోట్లకు పైనే
కొత్త చార్జీల ప్రకారం రూ.500 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీంతోపాటు జీఎస్టీ తదితరాల కింద రూ.45 కోట్లు పన్నులు కట్టాలని అధికారులు అంచనా వేశారు. ప్రజలు ఉచిత విద్యుత్ పథకం కింద ఈ మొత్తాన్ని నేరుగా ప్రభుత్వమే భరించాల్సి వస్తుందని విశ్లేషించారు. ప్రతి ఏటా ఉచిత విద్యుత్‌కు రూ.500 కోట్ల నుంచి 740 కోట్ల వరకూ వ్యయమవుతుందని సర్కారు తెలిపింది.
వరుసగా చార్జీల వడ్డింపులు
గతంలో కేఈఆర్‌సీ వెనువెంటనే విద్యుత్ చార్జీలను పెంచుతూ వచ్చింది. ఇటీవల మే 12న ప్రతి యూనిట్‌కు సరాసరి 70 పైసలు పెంచుతున్నట్లు కేఇఆర్‌సీ ప్రకటించింది. అంతలోనే జూలై–సెప్టెంబర్, అక్టోబర్– డిసెంబర్‌కు అన్వయించే విధంగా మళ్లీ 33 పైసల నుండి గరిష్ట 51 పైసలు వరకు చార్జీల వాత పెట్టింది. ముందు రెండు త్రైమాసికాల్లో, బెస్కాం సవరించిన ప్రకారం ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూ.1.01 పెరిగింది. దీనిద్వారా మొత్తం రూ.1.71 చొప్పున ప్రతి యూనిట్ విద్యుత్ వాడకంపై వడ్డించారు. 100 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు యూనిట్‌కు రూ.4.75 ఉండేది. 100 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ.7 అవుతుంది. ప్రభుత్వం ఉచితం పేరుతో విద్యుత్ సరఫరాను కుంటుపరచరాదని, ఇతర రంగాలపై దుష్ప్రభావం పడకుండా చూడాలని ఈ రంగ నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment