
కన్నీరు కారుస్తున్న మహిళ ఉద్యోగి
కర్ణాటక: ఆధార్ కార్డులో సవరణల కోసం పెద్దసంఖ్యలో మహిళలు వచ్చి ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఒక ఉద్యోగిని వలవలా ఏడ్చింది. ఈ సంఘటన రాయచూరులో చోటుచేసుకుంది. వివరాలు.. రాష్ట్ర సర్కార్ పలు గ్యారంటీ పథకాలను ప్రకటించగా వాటికి దరఖాస్తు చేయడానికి ఆధార్, ఇతర ధృవపత్రాల అవసరం పెరిగింది. ఈ సమయంలో ఆధార్‌లో ఉన్న తప్పులను, చిరునామాలను మార్పించుకోవడం కోసం ప్రజలు పెద్దసంఖ్యలో తహసీల్దార్ కార్యాలయాలకు వస్తున్నారు.
శనివారం రాయచూరు తహసీల్దార్ ఆఫీసులో గృహలక్ష్మి, గృహ జ్యోతి పథకాల కోసం ఆధార్ కార్డులో సవరణలు చేయించుకోవడానికి మహిళలు తరలివచ్చారు. అయితే ఇంటర్‌నెట్ సమస్య వల్ల కంప్యూటర్ పని ఆలస్యమైంది. దీంతో మహిళలు ఏకంగా కంప్యూటర్ గదిలో చొరబడడానికి ప్రయత్నించి పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ గందరగోళం చూసి అక్కడి మహిళా ఉద్యోగి భయపడిపోయి విలపించింది. వరుసలో రావాలని కోరినందుకు కొందరు దూషించారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలను పై అధికారులకు తెలిపినా మౌనం వహించారని చెప్పారు.
ఆర్టీసీ బస్సుల్లోనూ
కాగా ఇదే రీతిలో ఆర్టీసీ సిబ్బంది కూడా ఫిర్యాదు చేస్తున్నారు. సీట్ల కోసం మహిళలు తొక్కిసలాటకు పాల్పడడం, వారిస్తే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని మహిళా కండక్లర్లు ఫిర్యాదు చేశారు. ప్రయాణం ఉచితం కావడంతో క్షణాల్లో సీట్లన్నీ భర్తీ అవుతున్నాయి. పని ఒత్తిడితో నలిగిపోతున్నామని ఆర్టీసీ సిబ్బంది కూడా చెబుతున్నారు.