కృష్ణరాజపురం: ఉద్యాన నగరిలో క్యాబ్ కార్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు జాగ్రత్తగా ఉండాలనేందుకు ఇదొక ఉదాహరణ. క్యాబ్‌లో మహిళ స్నేహితునితో మాట్లాడిన మాటలను ఆయుధంగా మార్చుకుని బ్లాక్‌మెయిల్ చేసిన డ్రైవర్ ఆమె వద్ద నుంచి లక్షలాది రూపాయలను, బంగారాన్ని దోచుకున్నాడు. ఈ ఘటనలో హెసరఘట్ట నివాసి అయిన క్యాబ్ డ్రైవర్ కిరణ్ కుమార్ (35)ని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
బాల్య స్నేహితుడినంటూ..
వివరాలు.. కొంతకాలం కిందట ఇందిరా నగర నుంచి బాణసవాడికి వెళ్లాలని ఒక మహిళ క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా తన క్లాస్‌మేట్‌తో వ్యక్తిగత సమస్యలపై మాట్లాడింది. ఆ మాటలను విన్న డ్రైవర్ కిరణ్ కొన్ని రోజుల తర్వాత మహిళ మొబైల్‌కు మెసేజ్ చేశాడు. నీ బాల్య స్నేహితుడినని చెప్పుకోగా ఆమె నిజమేననుకుంది. ఆ తర్వాత ఫోన్లో పరిచయం పెంచుకుని తనకు ఆర్థిక సమస్య ఉందని, సాయం చేయాలని కోరాడు. బాల్య స్నేహితుడు అని భావించి జాలితో కొంత డబ్బు పంపింది. ఇలా రూ. 22 లక్షల వరకు అతడు వసూలు చేసి జల్సాలు చేశాడు. కొన్నిరోజులకు డ్రైవర్ తన స్నేహితుడు కాదని ఆమె తెలుసుకుని మాట్లాడడం మానేసింది.
భర్తకు చెబుతానని
కొన్నిరోజులు ఊరికే ఉన్న క్యాబ్ డ్రైవర్ మళ్లీ తిరిగి బెదిరించడం ప్రారంభించాడు. నీకు, నీ స్నేహితునికి మధ్య ఉన్న విషయాలను నీ భర్తకు చెబుతానని బెదిరించాడు. నీ భర్తకు తెలిస్తే సంసారం నాశనం అవుతుందని భయపెట్టాడు. దీంతో భీతిల్లిన మహిళ.. తన వద్ద ఉన్న సుమారు 750 గ్రాముల బంగారు ఆభరణాలను ఇచ్చింది. కొన్నాళ్లకు బంగారం లేదని తెలుసుకున్న భర్త భార్యను ప్రశ్నించగా జరిగిన ఉదంతం మొత్తం చెప్పింది. వెంటనే భార్యను తీసుకుని రామ్మూర్తినగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘరానా క్యాబ్ డ్రైవర్ కిరణ్‌ను అరెస్టు చేసి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment