కర్ణాటక: విజయనగర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హొసపేటె నగరానికి సమీపంలోని గుండా అటవీప్రాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం చెందారు, ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం జరిగింది.
వివరాలు.. హొసపేటెలోని ఉక్కడకేరికి చెందిన గోణి బసప్ప, కుటుంబ సభ్యులతో కలిసి ట్రాక్స్ క్రూయిజర్ వాహనంలో హరపనహళ్లి తాలూకా కూలహళ్లిలోని గోణి బసవేశ్వర ఆలయ దర్శనం చేసుకుని జాతీయ రహదారి–50పై ఇంటికి తిరుగుముఖం పట్టారు.
లారీలు మృత్యు శకటాలుగా...
మరికొంతసేపట్లో ఇంటికి చేరుకుంటామనేలోగా... హొసపేట వైపు నుంచి వేగంగా వస్తున్న మైనింగ్ టిప్పర్ లారీ అదుపుతప్పి క్రూయిజర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక వస్తున్న మరో మైనింగ్ లారీ.. వేగం అదుపు కాక క్రూజర్ మీదకు దూసుకొచ్చింది. అనూహ్య ఘటనలతో క్రూజర్ వాహనం తుక్కుతుక్కయిపోయింది. అందులోని ఏడుమంది తీవ్రగాయాలతో మరణించారు.
మృతులు వీరే
గోణిబసప్ప (65), ఉమా (45), భీమలింగప్ప (50), కెంచవ్వ (80), భాగ్యమ్మ (32), అనిల్ (30), యువరాజు (5) చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు చేరుకుని క్రూజర్ నుంచి గంటలకొద్దీ శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. కాగా ఒక లారీ రోడ్డుపక్కకు బోల్తా పడింది. లారీల డ్రైవర్లు, క్లీనర్లు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై టౌన్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇళ్ల నుంచి బయల్దేరినవారు ప్రమాదానికి గురయ్యారని తెలిసి బంధుమిత్రులు అక్కడికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.
గతంలోనూ ఇలాగే ప్రమాదం
ఈ ఏడాది జూన్ 30వ తేదీన... హొసపేటె తాలూకా వడ్డరహళ్లి వద్ద రెండు ఆటోలను ఒక లారీ ఢీకొట్టింది. రెండు ఆటోలు వంతెన పై నుంచి కింద పడి ఏడుమంది చనిపోగా 10 మంది గాయపడడం తెలిసిందే. జిల్లాలో వరుస భారీ రోడ్డు ప్రమాదాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment