సమస్యలు పరిష్కరించండి
బళ్లారి అర్బన్: జిల్లాలో 500కు పైగా జీపీ ఉద్యోగులు వివిధ సమస్యల పరిష్కారం కోసం నగరంలో ధర్నా చేపట్టి జిల్లాధికారి వినతిపత్రం సమర్పించారు. కనీస వేతనం రూ.31 వేలు, ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయడం తదితర సమస్యలను బెళగావి అసెంబ్లీ సమావేశాల్లోనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సమితి నేత తిప్పేస్వామి, జీపీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున స్వామి తదితరులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నగర వీధుల్లో తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. వివిధ సంఘాల నేతలు కుమార్, రాజాసాబ్, జడేస్వామి, శర్మాస్‌వలీ, సుబ్బారెడ్డి, కవిత, అన్నపూర్ణ, గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకగా పూల రథోత్సవం
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని తంబ్రహళ్లిలో కొట్టూరేశ్వర స్వామి వారి పూల రథోత్సవం మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. తాలూకాలోని తంబ్రహళ్లి గ్రామంలో కొట్టూరేశ్వర స్వామి ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి దీపం వెలిగించి కార్తీకోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం కొట్టూరేశ్వర ఉత్సవమూర్తిని ఊరేగింపులో గంగపూజతో పాటు తదితర విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు అక్కి శివకుమార్, మహాబలేశ్వరయ్య, దేవయ్య, గౌరజ్జనవర బసవరాజప్ప, అక్కి తోటేష్, ఎస్‌ఎం శివానందయ్య, బాచినల్లి బసవరాజు, ఆనేకల్ విరుపాక్షి, గుడ్లానూరు వసంత్, డీఎం.ప్రవీణ్, మృగలామణి తోటప్ప తదితరులు పాల్గొన్నారు.
వేతనాల కోసం ధర్నా
బళ్లారిఅర్బన్: తుంగభద్ర నీటిపారుదల విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలను తక్షణమే చెల్లించడంతో పాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని తుంగభద్ర కుడిగట్టు కాలువ టాస్క్‌వర్క్ ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. జిల్లాధికారి కార్యాలయంలో ఆందోళన చేపట్టి అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. నేతలు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఆధారంగా పని చేస్తున్న ఉద్యోగులకు గత నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించలేదని వాపోయారు. ఇప్పటికై నా తమ సమస్యలను పరిష్కరించాలని సంఘం నేతలు జంబ్లి మారెణ్ణ, హనుమంత తదితరులు కోరారు. కాగా ఆందోళనకు కర్ణాటక ఏకీకరణ రక్షణ సేన సమితి సంస్థాపక అధ్యక్షుడు పీ.శేఖర్, క్రాంతివీర సంగొళ్లి రాయన్న అధ్యక్షుడు బట్టి ఎర్రిస్వామి, కన్నడ హితరక్షణ వేదిక జిల్లాధ్యక్షుడు, దళిత నేత పంప, కళ్యాణ కార్మిక అధ్యక్షుడు మహానంది కొట్టం లక్ష్మణ్, ఆప్ జిల్లాధ్యక్షుడు మంజునాథ్, కృష్ణ వాల్మీకి, పోరాట యోధుడు లక్ష్మణ్ నాయక్, జేడీఎస్ యువనేత మహానంది కొట్టం వీరేష్, అక్కి శివణ్ణ, రాయాపుర మర్రిస్వామి, లష్కర్లు పాల్గొన్నారు.
గుంతలో చిక్కుకున్న లారీ
●వాహన రాకపోకలకు ఇబ్బంది
రాయచూరు రూరల్: లారీ బురద గుంతలో చిక్కుకు పోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. బుధవారం నగరంలోని బసవన బావి సర్కిల్ నుంచి బియ్యం మిల్లుల వరకు రహదారి నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో రహదారి గుంతలమయంగా మారింది. ఆరు నెలలుగా పనులు చేపట్టకుండా వదిలి వేయడంతో నేడు రహదారి బురదగుంతగా మారిది. భారీ వాహనాలు వెళ్లాలంటే ఎగుడు దిగుడు గుంతల్లో చిక్కుకొని రాకపోకలకు తోడు ప్రజలకు ఇబ్బందిగా మారింది. వరి బియ్యం మిల్లులు ఈ రహదారిలో ఎక్కువగా ఉండడం విశేషం. రాత్రి తాగునీటి పైపులు పగిలి పోవండతో నీరంతా రహదారిపైకి ప్రవహించాయి. దీంతో బియ్యం లోడు లారీ బురదగుంతలో చిక్కుకుంది.
Comments
Please login to add a commentAdd a comment