బిమ్స్ డైరెక్టర్‌ను సస్పెండ్ చేయండి
సాక్షి, బళ్లారి: వైద్యో నారాయణ హరి అంటే వైద్యుడిని దేవుడంటారని ప్రతీతి. అయితే పేదల, చావు బతుకుల మధ్య ఉన్న రోగులు బళ్లారి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(బిమ్స్) ఆస్పత్రికి వెళితే ప్రాణాలు దక్కుతాయో లేదో అన్న భయం నెలకొంటోందని, అందుకు ప్రధాన కారణం బిమ్స్ డైరెక్టర్ గంగాధర్‌గౌడను సస్పెండ్ చేయాలని బిమ్స్ ఆస్పత్రిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో బిమ్స్‌లో అస్తవ్యస్తమైన వైద్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా వందలాది కోట్ల రూపాయలు నిధులు పొందుతున్న బిమ్స్ ఆస్పత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన చోట మందుల చీటీలు బయటకు రాసి ఇస్తున్నారన్నారు.
పర్సంటేజీల రూపంలో మామూళ్లు
రక్త పరీక్షలు కూడా బయట ల్యాబ్‌లకు రాసిచ్చి వారితో పర్సంటేజీల రూపంలో మామూళ్లు తీసుకుంటున్నారన్నారు. బిమ్స్ డైరెక్టర్ ప్రతి పనుల్లోను పెద్ద ఎత్తున్న డబ్బులకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. బిమ్స్ ఆస్పత్రికి ఘనమైన చరిత్ర ఉందని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో దాదాపు 8 జిల్లాల ప్రజలు వచ్చి చికిత్స చేయించుకుంటారని, అయితే సరైన చికిత్స అందక పోవడం వల్ల బళ్లారికే చెడ్డ పేరు వస్తోందన్నారు. పెద్ద ఎత్తున నిధులు విడుదల అవుతున్నా డయాలసిస్ యంత్రాలు పని చేయడం లేదన్నారు. దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు నానా అవస్థలు పడుతున్నారన్నారు.
మందుల కోసం ఏటా రూ.20 కోట్లు
ఆస్పత్రిలో మందుల కోసం ఏటా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఆస్పత్రికి తాను వెళ్లి పరిశీలించిన సందర్భంలో మందుల చీటీలు బయటకు రాసి ఇవ్వడాన్ని బిమ్స్ డైరెక్టరును ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. రక్త పరీక్షలు, మందుల చీటీలు బయటకు ఎందుకు రాసి ఇస్తున్నారని ప్రశ్నించారు. పలువురు వైద్యులు సక్రమంగా పని చేయడం లేదని, బిమ్స్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బిమ్స్‌లో వైద్యానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించిన ఎమ్మెల్యే భరత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డైరెక్టర్లను సస్పెండ్ చేయకుంటే బిమ్స్‌లో పేదలకు వైద్యం అందని ద్రాక్ష అవుతుందని మండిపడ్డారు.
అవ్యవస్థపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గరం
Comments
Please login to add a commentAdd a comment