మినీ బస్ పల్టీ, 25 మందికి గాయాలు
దొడ్డబళ్లాపురం: నామకరణం వేడుకకు వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటన దొడ్డ తాలూకా ఎస్‌టీఆర్‌ఆర్ రోడ్డులోని మేస్ట్రు మనె క్రాస్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. తుమకూరు జిల్లా శిరా తాలూకా గిడ్డనహళ్లి గ్రామం నుంచి బెంగళూరు యలహంకలో ఆదివారంనాడు జరుగుతున్న నామకరణానికి 25 మంది మినీ బస్సులో బయల్దేరారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో అందరూ గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి దొడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒక చిన్నారితో కలిపి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్రేన్ ద్వారా బస్సును పక్కకు తొలగించారు.
కారు ఢీకొని
తండ్రీ కూతురు మృతి
దొడ్డబళ్లాపురం: బైక్‌ను ఓ కారు వేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొన్న ప్రమాదంలో తండ్రీ కుమార్తె దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన బెళగావి జిల్లా అథణి తాలూకా అనంతపుర గ్రామం వద్ద జరిగింది. బైక్‌పై వెళ్తున్న రాజు కర్ణి (49), జాహ్నవి (11) మృతులు. రాజు భార్య తీవ్రంగా గాయపడింది. రాజు కుటుంబం మహారాష్ట్రలోని జత్త తాలూకా మండిగురి గ్రామానికి చెందింది. అనంతపురలో జరిగే పెళ్లికి బైక్‌లో బయల్దేరాడు. పెళ్లి చూసుకుని తిరిగి వెళ్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. కారు డ్రైవర్ కారుతో పాటు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కేరళ నక్సలైట్ అరెస్టు
హోసూరు: కేరళకు చెందిన నక్సలైటును హోసూరులో అరెస్ట్ చేశారు. వివరాల మేరకు తమిళనాడులో కోయంబత్తూరు జిల్లా పొల్లాచి సమీపంలోని అళియారు ప్రాంతానికి చెందిన సంతోష్. గత 2014లో ఇంటి నుంచి వెళ్లిపోయి, కేరళ మావోయిస్ట్ నేత మైయుద్దీన్ వర్గంలో చేరుకొన్నాడు. అనేక గొడవలు, విధ్వంసాల్లో పాల్గొన్నాడు. సంతోష్‌పై తమిళనాడు, కేరళ రాష్ట్రంలో 40 కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న ఇతన్ని పట్టుకొనేందుకు కేరళ, తమిళనాడు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోసూరు రామ్‌నగర్‌లో ఓ ఇంటిలో దాగి ఉన్నట్లు తెలిసింది. దీంతో నిఘా పెట్టి శనివారం రాత్రి అతన్ని అరెస్ట్ చేశారు. ఇతన్ని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. తమ ఇళ్ల మధ్యలో నక్సలైటు ఉన్నాడని తెలిసి స్థానికులు ఆశ్చర్యపోయారు.
నగరంలో రౌడీ హత్య
బనశంకరి: సిలికాన్ సిటీలో రౌడీ హత్య జరిగింది. కారులో స్నేహితులతో కలిసి వెళ్తుండగా శత్రువులు అడ్డగించి అంతమొందించారు. ఈ ఘటన అశోకనగర ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. అనేపాళ్య రౌడీ హైదర్ అలీ (38) హతుడు. స్నేహితునితో కలిసి బార్ నుంచి అనేపాళ్యలలో ఇంటికి బయేల్దేరాడు. గరుడామాల్ వద్ద మకాంవేసిన ప్రత్యర్థులు కారును అడ్డుకున్నారు. కారులో నుంచి దిగిన హైదర్ అలీ పై కత్తులు, రాడ్లతో విరుచుకుపడ్డాడు. అడ్డుకోబోయిన స్నేహితున్ని కూడా వదలలేదు. ఇద్దరూ రక్తపుమడుగులో పడిపోయారు. పోలీసులు చేరుకుని బౌరింగ్ ఆసుపత్రికి తరలిస్తుండగా హైదర్ అలీ చనిపోయాడు. స్నేహితుడు చికిత్స పొందుతున్నాడు. అతని మద్దతుదారులు బౌరింగ్ ఆసుపత్రికి చేరుకుని కేకలు వేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
అన్నదాత ఆత్మహత్య
మైసూరు: మైసూరు జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కనీసం వారానికి ఒకరిద్దరు రైతులు ఊపిరి విడుస్తున్నారు. హుణసూరు తాలూకాలోని హరవెకల్ళహళ్ళిలో శివణ్ణ (40) అనే రైతు పురుగులు మందు తాగి చనిపోయాడు. శివణ్ణ సేద్యం కోసం సహకార బ్యాంకులో రూ. 80 వేలు అప్పు చేశాడు, కేఆర్ నగరలో ఆశీర్వాద ఫైనాన్స్‌లో రూ.70 వేల వరకు అప్పు చేశారు. మరో ఫైనాన్స్‌లో రూ.1 లక్ష, చిన్న చిన్న అప్పులు మరో రూ. లక్ష వరకూ ఉన్నాయి. రెండు ఎకరాలలో సాగుచేసిన పంటలు పండలేదు, దీంతో అప్పుల భారం ఎక్కువైంది. విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
మినీ బస్ పల్టీ, 25 మందికి గాయాలు
మినీ బస్ పల్టీ, 25 మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment