గవర్నర్ విశేష పూజలు
తుమకూరు: నేడు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు అని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. జిల్లాలో కుణిగల్ తాలూకాలోని బిదనగెరె శ్రీబసవేశ్వర మఠంలో కొత్తగా నిర్మించిన నవగ్రహ దేవాలయం, నూతన గోపురం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశం అంటేనే రుషులు, మునులకు, ఆచార్యులకు, సంప్రదాయాలకు పెట్టింది పేరని అన్నారు. ఈ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు.
పేలిన నాటుబాంబు..
ఇద్దరు బాలలకు గాయాలు
మండ్య: నాటుబాంబు పేలడంతో ఇద్దరు బాలలు గాయపడిన సంఘటన జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని కంబదహళ్ళి గ్రామంలో జరిగింది. హరిహంత్ పాటిల్, పార్థ అనే బాలలు జైన బసది పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. ఆదివారం దగ్గరలో ఉన్న ఆంజనేయకొండ ఆలయానికి వెళ్లి చెత్త ఊడుస్తున్నారు. చెత్తకుప్పలో చేయి పెట్టిన సమయంలొ ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు తీవ్రతకు ఒక బాలునికి మోచేయి వరకు గాయం అయ్యింది, మరొకరికి ముఖానికి గాయాలు తగిలాయి. కొండ సమీపంలో పందుల సమస్య ఎక్కువగా ఉండడంతో వాటిని వేటాడేందుకు చెత్తలో నాటు బాంబులు పెట్టి ఉండవచ్చని అనుమానాలున్నాయి. బాధితులను బెళ్లూరు ఆదిచుంచనగిరి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఉదయగిరి.. కిరికిరి
● జిల్లా బహిష్కారం తగదు
● కోర్టులో నిందితుడు సతీష్ అర్జీ
మైసూరు/శివాజీనగర: నగరంలో ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌పై ఇటీవల ఓ వర్గం వారు ముట్టడించి రాళ్ల దాడి చేయడం తెలిసిందే. తమ మతాన్ని కించపరిచేలా ఓ వ్యక్తి పోస్టు పెట్టాడని, అతన్ని తమకు అప్పగించాలని అల్లర్లకు పాల్పడ్డారు. పోస్టు పెట్టిన వ్యక్తి సతీష్ అలియాస్ పాండురంగను నగర పోలీసులు జిల్లా నుంచి బహిష్కరించారు. జిల్లాలో ఉంటే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందంటూ ఈ చర్య తీసుకున్నారు. అయితే ఇది అన్యాయం, ఈ నోటీసును రద్దు చేయాలని సతీష్ తన న్యాయవాది నగర కోర్టులో కేసు దాఖలు చేశారు. సతీష్‌కు ఎలాంటి క్రిమినల్ చరిత్ర, కేసు లేదని, అలాంటి వ్యక్తిని ఎలా బహిష్కరిస్తారని ప్రశ్నించారు.
నేడు చలో మైసూరు: విజయేంద్ర
ఉదయగిరి అల్లర్లను ఖండిస్తూ సోమవారం మైసూరు చలో ధర్నా చేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తెలిపారు. ఆదివారం బెంగళూరులో ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌ని ఆలకించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలు కాపాడడంలో పూర్తిగా విఫలమైంది. ఉదయగిరిలో అల్లర్లకు పాల్పడినవారిని కాపాడుతోంది. దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయి. బెంగళూరు ప్రశాంతంగా లేదు అని ఆరోపించారు. రాజీనామా చేస్తానని హోంమంత్రి చెప్పడం సరికాదు, ఈ విధంగా మాట్లాడితే దేశ ద్రోహులు, హంతకులకు కొండంత బలం వచ్చినట్లయిందని ధ్వజమెత్తారు. బెళగావిలో బస్ కండక్టర్‌పై దాడి చేసిన వారిని శిక్షించాలన్నారు.
గవర్నర్ విశేష పూజలు
Comments
Please login to add a commentAdd a comment