
పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన అవసరం
కోలారు : పిల్లలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తామని జిల్లా కానూను సేవల ప్రాధికార అధ్యక్షుడు, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జీఎం మంజునాథ్ అన్నారు. పోక్సో చట్టంపై కోలారు నగరంలోని జిల్లా పంచాయతీ సభాంగణంలో గురువరం నిర్వహించిన అవగాహన సదస్సులో జడ్జి పాల్గొని మాట్లాడారు. పిల్లలపై లైంగిక దౌర్జన్యాలను అరికట్టడానికి పోక్సో చట్టం గురించి ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉందన్నారు. పోక్సో కేసుల్లో వైద్యులు అత్యంతజాగ్రత్తగా పరిశీలన చేసి నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్నారు. వైద్యులు నివేదిక ఆధారంగానే తీర్పులు ఉంటాయన్నారు. కేజీఎఫ్ ఎస్పీ శాంతరాజు మాట్లాడుతూ ఎక్కడ లైంగిక దౌర్జన్యాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సీనియర్ సివిల్ న్యాయమూర్తి సునీల్ ఎస్ హొసమని మాట్లాడుతూ జైళ్లను సందర్శించిన సమయంలో 18 నుంచి 20 సంవత్సరాల లోపు విచారణ ఖైదీలు కనిపిస్తుంటారన్నారు. వీరంతా పోక్సో కేసుల్లో చిక్కుకున్న వారే అధికంగా ఉంటారన్నారు. లైంగిక దాడులకు గురైన బాలికలను స్టేషన్‌కు పిలిపించకుండా ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలన్నారు.సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.ఆర్ రవి, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ జీ శ్రీనివాస్, కోలారు ఎస్పీ బి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఇదే మయంలో ప్రభుత్వ పంచ గ్యారెంటీల హాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment