
విమానాశ్రయంలో జాగ్రత్త
దొడ్డబళ్లాపురం: విదేశాల నుంచి తీసుకువచ్చే అనేక వస్తువులు, ముఖ్యంగా బంగారం,వజ్రాలు, విలువైన వస్తువులు, మత్తు పదార్థాలను ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు సీజ్ చేస్తుంటారు. ఇటీవల రన్య రావు బంగారం తరలిస్తూ పట్టుబడ్డాక ఈ విషయాలపై ప్రజలకు ఆసక్తి ఎక్కువైంది. కొత్తగా విమాన ప్రయాణాలు చేసేవారికి వస్తువులను తీసుకెళ్లరాదో తెలియక తికమక పడుతుంటారు. కొన్నిసార్లు చిక్కుల్లో ఇరుక్కుంటారు. ఇప్పుడే వస్తారు, ఈ బ్యాగును కాస్త చూడండి, లేదా బయట మా వారికి ఇవ్వండి అని ఎవరైనా అడిగితే లేదనే చెప్పాలి. ఆ బ్యాగులో నిషేధిత వస్తువులు ఉంటే అంతే సంగతులు.
పవర్ బ్యాంకులే ఎక్కువగా సీజ్
ఇక బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో అత్యధికంగా పట్టుబడే వస్తువు ఏదో తెలుసా.. మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు చార్జింగ్‌కు వాడే పవర్ బ్యాంక్. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. విమానాశ్రయ భద్రతా నిబంధనల ప్రకారం పవర్ బ్యాంకులు ప్రయాణికుల వద్ద, వారి లగేజీల్లో ఉండరాదు. ఎందుకంటే అవి లిథియం–ఐయాన్ బ్యాటరీలను కలిగి ఉంటాయి. పేలిపోయి ప్రమాదం ఉంటుందని నిషేధించారు. కానీ వీటిని ప్రయాణికులు తమ వెంట ఉండే చిన్న బ్యాగుల్లో తీసుకెళ్లవచ్చు. అవి కూడా చిన్న చిన్న పవర్‌బ్యాంకులను మాత్రమే. అధిక సామర్థ్యం ఉన్నవాటిని తీసుకెళ్లరాదు. చాలామందికి ఈ విషయం తెలియక చెక్–ఇన్ బ్యాగుల్లో ఉంచడం వల్ల కనబడగానే సీజ్ చేస్తున్నారు. అలాగే లైటర్‌లు, ఈ–సిగరెట్లు కూడా సీజ్ చేస్తారు. కత్తులు, పదునైన వస్తువులను అనుమతించరు.
అమ్మో ఎండు కొబ్బరి
ఎండుకొబ్బరి తింటూ విమాన ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే కుదరదు. చాలా విమాన సంస్థలు ఎండుకొబ్బరిని అనుమతించవు. దానికి మంటలు అంటుకునే గుణం ఉండడమే కారణం. ఇక బొమ్మ తుపాకులు, పేలుడు పదార్థాలు, రసాయనాలు వంటివి తీసుకెళ్లరాదు.
ఈ వస్తువులు తీసుకెళ్లరాదు
లగేజీలో పవర్ బ్యాంకులు వద్దు
లైటర్లు, పదునైన వస్తువులు సీజే
భారీగా జప్తు
కేఐఏ సమాచారం ప్రకారం గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ప్రయాణికుల నుంచి 1,412 కేజీల పవర్ బ్యాంకులను సీజ్ చేశారు. 556 కేజీల బరువైన లైటర్‌లు, 576 కేజీల ఈ–సిగరెట్లు కూడా సీజ్ చేయడం జరిగింది.

విమానాశ్రయంలో జాగ్రత్త

విమానాశ్రయంలో జాగ్రత్త

విమానాశ్రయంలో జాగ్రత్త
Comments
Please login to add a commentAdd a comment