
గ్యాస్ పేలుడు, ఇల్లు ధ్వంసం
కృష్ణరాజపురం: బెంగళూరులోని బైయప్పనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో మహదేవపుర నాగప్పరెడ్డి బ్లాక్‌లో గురువారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ లీకై పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంటిలోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి నుంచి గ్యాస్ లీకవుతోంది. అయితే కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు. ఉదయం ఇంట్లో స్విచ్ వేయగానే పేలుడు జరిగింది. తీవ్రతకు గోడలు పగిలిపోయాయి. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పేలుడుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కరెంటు షాక్‌తో మహిళ మృతి
కృష్ణరాజపురం: తాగు నీరు పట్టుకుంటుండగా కరెంటు షాక్ కొట్టి ఓ మహిళ మరణించిన ఘటన బెంగళూరులోని చామరాజపేటె పోలీసు స్టేషన్ పరిధిలోని ఆనందపుర మార్కెట్ రోడ్డులో జరిగింది. ఆ కాలనీలోని ఏ ఇంటికీ కొళాయి కనెక్షన్ లేదు. అక్కడక్కడ తాగునీటి పైప్‌లైన్‌కు అక్రమంగా పైపులు వేసి మోటార్ కనెక్షన్ తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో మోటార్ స్టార్ట్ చేస్తుండగా కరెంటు షాక్ తగిలి ఓ మహిళ మరణించింది. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన అక్కడి ప్రజలు రాస్తారోకో జరిపారు. పాలికె, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని శాపనార్థాలు పెట్టారు.
మంత్రి జమీర్ చర్చలు
బనశంకరి: మృతురాలు సెల్వి (58) కాగా, ఆమె కుటుంబానికి పరిహారం అందించాలని, తమ ఇళ్లకు తాగునీటి వసతిని కల్పించాలని జనం పట్టుబట్టారు. స్థానిక మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి జమీర్ వచ్చి వారితో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. ఆనందపుర ప్రదేశంలో స్థానికులు అక్రమంగా కావేరి నీటి పైప్ నుంచి ఇంటింటికి నీటి కనెక్షన్ తీసుకుని మోటార్లు అమర్చుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.
రమణీయంగా తేరు వేడుక
మైసూరు: మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకాలోని ప్రసిద్ధ శక్తిదేవత శ్రీ మసణికమ్మ దేవి బ్రహ్మరథోత్సవం గురువారం రమణీయంగా జరిగింది. ఎత్తైన తేరును రకరకాల పూలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పూజలు చేసి ఆసీనుల్ని చేసి తేరును లాగారు. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు పానీయాలు, అన్నదాన వితరణ సాగింది.
గరుడ ముఠా క్రిమినల్‌పై కాల్పులు
యశవంతపుర: వరుస ప్రమాదాలు చేసి తప్పించుకు తిరుగుతున్న మంగళూరు గరుడ గ్యాంగ్ నేరగాడు ఇసాక్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఉడుపి హిరియడ్య సమీపంలో గుడ్డెయంగడిలో బుధవారం విచారణకు తీసుకెళ్లగా, దాడి చేసి పారిపోవడానికి యత్నించగా కాల్పులు జరిపారు. ఈ నెల మొదటి వారంలో బెంగళూరు రూరల్ నెలమంగల పోలీసులు ఉడుపి జిల్లా మణిపాల్‌లో అతనిని వెంటాడి పట్టుకున్నారు. అతని పై పలు నేరారోపణలు ఉన్నాయి. ఇతనిని ఉడుపిలో రిమాండులో ఉంచారు. బుధవారం సాయంత్రం ఓ నేర స్థలికి పరిశీలనకు తీసుకెళ్తుండగా మూత్ర విసర్జనకని జీపు దిగాడు. తరువాత పోలీసులను పక్కకు తోసి పారిపోసాగాడు. మణిపాల్ సీఐ దేవరాజు పిస్టల్‌తో అతని కాలిపై కాల్పులు జరపడంతో పడిపోయాడు. అతనిని, అతని దాడిలో గాయపడిన పోలీసులను మణిపాల్ కెఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు.

గ్యాస్ పేలుడు, ఇల్లు ధ్వంసం

గ్యాస్ పేలుడు, ఇల్లు ధ్వంసం

గ్యాస్ పేలుడు, ఇల్లు ధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment