తాగునీటి ఇబ్బందులు నివారిస్తాం
రాయచూరు రూరల్: జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు నివారిస్తామని జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే పేర్కొన్నారు. ఆయన గురువారం సిరవార తాలూకా గణేకల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించి మాట్లాడారు. తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడిచినందున పోలీస్ బందోబస్తు మధ్య తాగునీటి చెరువులను నింపాలనీ జిల్లాధికారి సూచించారన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తోడు మరమ్మతు పనుల నిర్మాణానికి పంచాయతీ ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పక్షుల సంతతి
కాపాడుకుందాం
రాయచూరు రూరల్: నగర, పట్టణ ప్రాంతాల్లో మూగ జీవాలు, పక్షులకు నీటి సౌకర్యం కల్పించి కాపాడుకుందామని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. గురువారం నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రపంచ పిట్టల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నీటి తొట్టెలను ఏర్పాటు చేసి మాట్లాడారు. చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లోని చెట్లు, కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో వేసవి కాలంలో నీటి దాహార్తి తీర్చడానికి నీటి తొట్టెలు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్‌లో మండుటెండల వేడిమి నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు.
సీసీ కెమెరాల నిఘాతో
అక్రమాలకు చెక్
రాయచూరు రూరల్: నగరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు తోడు నిఘాకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. బుధవారం రాత్రి నగరంలోని మహాబలేశ్వర, జాకీర్ హుసేన్ సర్కిల్‌లో అమర్చిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి రూ.35 వేలతో వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చారన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సత్యనారాయణ, సదర్ బజార్ సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్‌ఐ సణ్ణ ఈరణ్ణ, ఏఎస్‌ఐ శ్రీనివాస్, బసవరాజ్, చాంద్ పాషా, మానవ హక్కుల కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ మోహిధ్‌లున్నారు.
సాగునీటి కోసం రాస్తారోకో
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణపుర కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరందించాలని కర్ణాటక రైతు సంఘం జిల్లాధ్యక్షుడు శివపుత్ర పాటిల్ డిమాండ్ చేశారు. గురువారం జాలహళ్లి వద్ద రహదారిపై రాస్తారోకో చేపట్టి మాట్లాడారు. ఎడమ కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి అధికారులు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంట నోటికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు అందించడానికి శాశ్వత పరిష్కారం చేపట్టడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావడం లేదని ఆరోపించారు. తుంగభద్ర ఎడమ కాలువ చివరి భూములకు ఏప్రిల్ చివరి వరకు నీరందివ్వాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు.
తాగునీటి ఇబ్బందులు నివారిస్తాం
తాగునీటి ఇబ్బందులు నివారిస్తాం
తాగునీటి ఇబ్బందులు నివారిస్తాం
Comments
Please login to add a commentAdd a comment